ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)ల్లో చివరకు న్యూజిలాండ్‌నే విజయం వరించింది. ఇక్కడ న్యూజిలాండ్‌ను విజయం వరించింది అనే కంటే వారు పోరాడిన తీరే విజేతగా నిలిపిందంటేనే సమంజసం. ఈ మ్యాచ్ ఆరంభమైన దగ్గర్నుంచీ ఏదొక సమయంలో వర్షం పలకరిస్తూనే ఉండటంతో అసలు ఫలితం వస్తుందా అనే సందిగ్థతను అధిగమించి మరీ కివీస్ విజయాన్ని నమోదు చేయడం ఇక్కడ విశేషం.
ఏ దశలోనూ భారత్‌కు అవకాశం ఇవ్వని కివీస్.. అందుకు తగ్గ ఫలితాన్ని నమోదు చేసి శభాష్ అనిపించుకుంది. దేశ విస్తీర్ణం, జనాభా, ఆదాయం ఇలా ఏ విధంగా చూసుకున్న ఎంతో చిన్న దేశమైన న్యూజిల్యాండ్ ఈ స్థాయి ప్రదర్శన చేయడానికి కారణం ఏంటీ ? అక్కడ వారికి అనుకూలిస్తున్న అంశాలేంటీ ? ఓ సారి చూద్దాం.
ఢిల్లీతో పోల్చిన దిగదుడుపే
ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న కొన్ని ద్వీపాల సముదాయమే న్యూజిల్యాండ్. ఆ దేశ జనాభా కేవలం 50 లక్షలు. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా రాజధాని ఢిల్లీ జనాభాయే 2 కోట్లకు పైమాట. మన దేశ రాజధాని జనాభాలో నాలుగో వంతు జనాభా ఉన్న న్యూజిల్యాండ్, ఈ రోజు క్రీడల్లో ముందు ఉండటానికి ఆ దేశం అనుసరిస్తున్న విధానాలే కారణం.
జీవన ప్రమాణాలు
అత్యుత్తమమైన క్రీడాకారులు రూపు దిద్దుకోవడంలో ఆ దేశంలో ఉన్న వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు కీలక పాత్ర పోషిస్తాయి. మానవాభివృద్ధి సూచికలో న్యూజిల్యాండ్ 14వ స్థానంలో ఉండగా ఇండియా 131వ స్థానంలో నిలిచించి. ఆ దేశంలో పేదరికం అసలు లేకపోగా ఇండియాలో 20 శాతానికి పైగా జనాభా తీవ్రమైన పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది.
స్కూల్ దశలోనే
అత్యుత్తమ క్రీడాకారులు రూపుదిద్దుకోవడంలో విద్యార్ధి దశ ఎంతో కీలకం. పాఠశాల స్థాయిలోనే మెరుగైన వసతులు కల్పించి చక్కని శిక్షణ అందిస్తే ఫలితాలు మరో మెట్టుపైన ఉంటాయి. అందుకు న్యూజిల్యాండ్ ఉదాహారణ. ఆ దేశంలో విద్యార్ధులు సగటున 12.5 ఏళ్లు పాఠశాలలో ఉంటుండగా ఇండియాలో డ్రాపవుట్స్ కారణంగా కేవలం 6.5 శాతమే స్కూళ్లలో ఉంటున్నారు. ఈ దేశ జీడీపిలో 6.4 శాతం విద్యపై ఖర్చు చేస్తుండగా మనదగ్గర కేవలం 3.8 శాతం నిధులు విద్యకు కేటాయిస్తున్నాం.
వైద్యరంగంలో
వైద్య ప్రమాణాల పరంగా కూడా న్యూజిల్యాండ్ మెరుగైన స్థితిలో ఉంది. అక్కడ సగటు ఆయురార్థం 82 ఏళ్లు కాగా మన దగ్గర అది 70 ఏళ్లుగా ఉంది. కీలకమైన శిశు మరణాల విషయంలో న్యూజిల్యాండ్‌లో వందకు నలుగురు చనిపోతుండగా ఇక్కడ ఆ సంఖ్య 28గా ఉంది. వైద్యరంగంపై అక్కడి ప్రభుత్వాలు 9.2 శాతం ఖర్చు చేస్తుండగా మన దగ్గర కేవలం 3.5 శాతమే ఖర్చు చేస్తున్నాం.
ఫలితాలు ఇలా
న్యూజిల్యాండ్ జనాభా 50 లక్షలు అయినప్పటికీ క్రీడల్లో రాణించే వయస్సయిన 20 నుంచి 39 ఏళ్ల వరకు ఉన్న జానాభా కేవలం 13 లక్షలే అదే ఢిల్లీలో ఇదే వయస్సు జనాభా 77 లక్షలు, ఇండియా మొత్తం మీద 45 కోట్ల మంది ఉన్నారు. అయితే క్రికెట్ మినహా మిగిలిన క్రీడల్లో మనం వెనుకబడి ఉన్నామనేది కాదనలేని వాస్తవం.
ఒలంపిక్స్‌లో
బ్రెజిల్‌లో 2016లో జరిగిన ఒలంపిక్‌లో 136 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించిన మన ఆటగాళ్లు రెండు పతకాలకే పరిమితం అయితే 50 లక్షల జనాభాకు ప్రాతినిధ్యం వహించిన న్యూజిలాండ్ ఏకంగా 18 పతకాలు తన ఖాతాలో వేసుకుంది. ఇందులో నాలుగు బంగారు పతకాలు ఉన్నాయి.
ఇతర ఆటల్లోనూ
క్రికెట్, ఒలంపిక్స్ అనే కాదు మనం గొప్పగా చెప్పుకునే హాకీలో కూడా న్యూజిల్యాండ్ మెరుగ్గానే ఉంది. ప్రపంచ హాకీ ర్యాంకింగుల్లో ఇండియా 4వ స్థానంలో ఉండగా న్యూజిల్యాండ్ 8వ స్థానంలో ఉంది. రగ్బీ ,బాస్కెట్‌బాల్ వంటి ప్రజాధారణ పొందిన క్రీడల్లోనూ ఆ దేశ ప్లేయర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment