టైటిల్‌ గెలవకపోతేనేం: స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

RCB: టైటిల్‌ గెలవకపోతేనేం: స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, Mar 19 2024 6:11 PM

Title Doesnt Define: RCB Mandhana Blunt Take On Comparisons With Kohli - Sakshi

WPL 2024 Winner- RCBW: టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లితో తనను పోల్చడం సరికాదని భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన పేర్కొంది. జాతీయ జట్టు తరఫున కోహ్లి సాధించిన విజయాలు వెలకట్టలేనివని కొనియాడింది. కేవలం టైటిల్‌ గెలవడం ఒక్కటే గొప్ప కెప్టెన్‌ అన్న పదానికి నిర్వచనం కాదంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది.

కాగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీకి అందని ద్రాక్షగా ఉన్న ట్రోఫీని స్మృతి మంధాన అందించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌తో పాటు మహిళల కోసం బీసీసీఐ నిర్వహిస్తున్న వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆర్సీబీని విజేతగా నిలిపింది.

WPL 2024లో ఆర్సీబీకి టైటిల్‌ అందించింది. పదహారేళ్లుగా ఆర్సీబీతోనే ఉన్న విరాట్‌ కోహ్లికి సాధ్యం కాని ఘనతను స్మృతి సాధించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోలికల గురించి ప్రస్తావనకు రాగా స్మృతి మంధాన హుందాగా స్పందించింది.

‘‘మా ఇద్దరిని పోల్చి చూడటం సరైంది కాదు. ఆయన సాధించిన విజయాలు గొప్పవి. ఎంతో మందికి కోహ్లి ఆదర్శం. టైటిల్‌ గెలిస్తేనే గొప్ప కెప్టెన్‌ అంటే ఒప్పుకోను.

విరాట్‌ని గౌరవించడం కూడా మనకు గౌరవం లాంటిదేనని భావిస్తా. ఇక మా ఇద్దరి జెర్సీల వెనకాల 18 ఉండటాన్ని కూడా పెద్దగా పోల్చి చూడాల్సిన పనిలేదు. అది కేవలం వ్యక్తిగత ఎంపిక మాత్రమే.

నా పుట్టినరోజు 18న కాబట్టి నేను ఆ నంబర్‌ను నా జెర్సీ మీద వేయించుకున్నా. అంతేగానీ ఆ నంబర్‌ వేసుకున్నంత మాత్రాన నా ఆటను విశ్లేషించే తీరు మారకూడదు. 

అయినా గత పదహారేళ్లుగా ఆర్సీబీ పురుషుల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. టైటిల్‌ గెలవనంత మాత్రానా వారి ప్రదర్శనను తక్కువ చేసి చూడకూడదు. ఆర్సీబీ అనేది ఒక ఫ్రాంఛైజీ. ఇక్కడ మహిళా, పురుష జట్లను వేర్వేరుగానే పరిగణించాలి’’ అని స్మృతి మంధాన మంగళవారం మీడియాతో వ్యాఖ్యానించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement