బెనోని (దక్షిణాఫ్రికా): డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఆరో ప్రపంచకప్ లక్ష్యంగా అంతిమ సమరానికి సన్నద్ధమైంది. ఈ టోర్నీలో పరాజయమెరుగని భారత జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఈ టోర్నీలో అసాధారణ ఫామ్‌లో ఉంది. కుర్రాళ్ల మెగా ఈవెంట్ చరిత్రలో తొమ్మిదోసారి టైటిల్ వేటకు అర్హత సాధించిన భారత్‌కు ఫైనల్ ప్రత్యర్థిపై మంచి రికార్డు ఉంది. ఆసీస్ ఐదుసార్లు ఫైనల్ చేరింది.
పాక్ (1988, 2010), దక్షిణాఫ్రికా (2002)లపై గెలిచిన ఆసీస్‌కు 2012, 2018లలో జరిగిన ఫైనల్స్‌లో మాత్రం రెండు సార్లు భారత్ చేతిలో పరాభవం ఎదురైంది. ఇప్పుడు ఇదే రికార్డును ఈ టోర్నీలోనూ అజేయ భారత్ కొనసాగించాలని ఆశిస్తోంది. ప్రస్తుత టోర్నీలో జట్ల బలాబలాల విషయానికి వస్తే యువభారత్ ఆల్‌రౌండ్ షోతో జైత్రయాత్ర చేస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఉదయ్ సహరణ్ (389 పరుగులు), ముషీర్ ఖాన్ (338), సచిన్ దాస్ (294) సూపర్ ఫామ్‌లో ఉన్నారు.
బౌలింగ్‌లో సౌమీ పాండే (17 వికెట్లు) స్పిన్ మాయాజాలం ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తోంది. మరోవైపు ఆసీస్ తరఫున ఓపెనర్ హ్యారీ డిక్సన్ (267 పరుగులు), కెప్టెన్ హ్యూగ్ వేగన్ (256) రాణించారు. బౌలింగ్‌లో కలమ్ విడ్లెర్ (12 వికెట్లు), టాస్ స్ట్రేకర్ (12 వికెట్లు) ప్రత్యర్థి బ్యాటర్లపై ప్రభావం కనబరిచారు.
విజయాల పరంగా కూడా ఆసీస్... భారత్ లాగే దీటైన ప్రదర్శన చేసింది. సూపర్ సిక్స్‌లో విండీస్‌తో మ్యాచ్ వర్షంతో రద్దవగా మిగతా ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య ఫైనల్ హోరాహోరీగా జరిగే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment