ఈ ఐపీఎల్‌కు ఎవరు శుభం కార్డు వేస్తారో ఈ రాత్రే తేలుతుంది. ఈ సీజన్‌కు శ్రీకారం చుట్టిన జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్ జరుగనుండటం ఆసక్తికరం.డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ‘డబుల్ ధమాకా’కు సన్నద్ధం కాగా... నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ‘ఫైవ్ స్టార్’ ముంబై సరసన నిలవాలని ఆశిస్తోంది. రెండూ మేటి జట్లే! ఈ సీజన్ అసాంతం గట్టి పోరాటాలే చేశాయి. ఓపెనర్ల మెరుపులే ఇరు జట్లను శాసిస్తున్నాయి. మరి ఈ ఫైనల్లో ఎవరి మెరుపులు విజయాన్నిస్తాయో ఈ ‘సూపర్ సండే’ రోజు చూసేయండి.
అహ్మదాబాద్: తొలి క్వాలిఫయర్ చూశాం కదా... మళ్లీ చూద్దాం ‘ఫైనల్’గా! ఎందుకంటే ఆ మ్యాచ్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), గుజరాత్ టైటాన్స్ మధ్యే టైటిల్ పోరు జరుగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా ఆల్‌రౌండ్ సమతూకంతో ఉన్న జట్ల మధ్యే అమీతుమీ జరగనుండటం... టాపార్డర్‌లో హిట్టర్లుండటంతో నేడు నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల విందు ఖాయం.
టైటాన్స్ తమ సొంతగడ్డపై టైటిల్ నిలబెట్టుకునేందుకు తహతహలాడుతోంది. శుబ్‌మన్ గిల్ సంచలన శతకాలు, బౌలర్ల వెన్నుదన్ను జట్టును మరో మెట్టుపై నిలబెడుతోంది. అలాగని సూపర్ కింగ్స్‌ను తక్కువ చేయలేం. కీలకమైన మ్యాచ్‌ల్లో ధోని మార్క్ సారథ్యం జట్టుకు అదనపు ‘ఇంపాక్ట్’ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫైనల్ ఫైనలే! ఎవరూ తగ్గేదేలే!
ధోని అనుభవం గెలిపిస్తుందా?
ధోని... ధోని... ఇప్పుడంతా ఇదే ఫీవర్. వచ్చే సీజన్ ఆడేది లేనిది ఇప్పుడైతే చెప్పలేదు కానీ. ట్రోఫీ గెలిస్తే మాత్రం విజయంతో నిష్క్రమించే అవకాశాలైతే ఉన్నాయి. అందుకేనేమో ఇర్ఫాన్ పఠాన్‌లాంటి గుజరాతీలు సైతం దిగ్గజ కెప్టెన్ ఉన్న సూపర్ కింగ్సే గెలవాలని మనసారా కోరుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేల శుభారంభమిస్తే... దీనికి అజింక్య రహానే, శివమ్ దూబే మెరుపులు తోడయితే చెన్నై భారీస్కోరుకు ఢోకానే ఉండదు.
డెత్ ఓవర్లను కాచుకునేందుకు మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా ఉండనే ఉన్నారు. బౌలింగ్‌లో తీక్షణ, పతిరణ తుషార్ దేశ్‌పాండే, దీపక్ చహర్‌లు ధోని నమ్మకాన్ని నిలబెడుతున్నారు. ధోనికిది 11వ ఐపీఎల్ ఫైనల్. (చెన్నై తరఫున పదోది) అయితే చెన్నైకిది మింగుడు పడని వేదిక అహ్మదాబాద్. ఇక్కడ ఆడిన మూడుసార్లూ చెన్నై ఓడిపోయింది. ఇదొక్కటే జట్టుకు మైనస్!
అచ్చొచ్చే సొంతగడ్డపై...
ప్లే ఆఫ్స్‌లో గుజరాత్... చెన్నైతో వెనుకబడినప్పటికీ రెండో క్వాలిఫయర్‌లో ఐదుసార్లు చాంపియన్ ముంబైని మట్టికరిపించింది. శుబ్‌మన్ గిలే జట్టు బలం. ఈ సీజన్‌లో మూడు సెంచరీలతో జోరుమీదున్నాడు. కలిసొచ్చే అహ్మదాబాద్ వేదికపై మళ్లీ చెలరేగినా ఆశ్చర్యమైతే లేదు.
ఎందుకంటే ఇక్కడే గుజరాత్ తొమ్మిదింట ఆరు మ్యాచుల్లో గెలిచింది. సాయి సుదర్శన్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిల్లర్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంటే... షమీ (28 వికెట్లు), రషీద్ ఖాన్ (27 వికెట్లు), మోహిత్ శర్మ (24 వికెట్లు)లతో బౌలింగ్ దళం కూడా దీటుగా ఉంది. పర్పుల్ క్యాప్ రేసులో ఈ ముగ్గురే ఉన్నారు.
9 ఇప్పటి వరకు జరిగిన 15 ఐపీఎల్ ఫైనల్స్‌లో తొమ్మిదిసార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజేతగా నిలిచింది. ఆరుసార్లు ఛేజింగ్ చేసిన జట్టు చాంపియన్‌గా అవతరించింది.
3 నేటి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) జట్ల తర్వాత వరుసగా రెండేళ్లు ఐపీఎల్ టైటిల్ సాధించిన మూడో జట్టుగా గుర్తింపు పొందుతుంది.
0 ఇప్పటి వరకు 15 ఐపీఎల్ ఫైనల్స్ మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా ఒక్కసారీ ఆలౌట్ కాలేదు.
5 మొత్తం ఐపీఎల్ ఫైనల్స్‌లో ఐదుసార్లు ఆయా జట్లు 200 అంతకంటే ఎక్కువ పరుగులు చేశాయి.
రూ. 20 కోట్లు ఐపీఎల్ విజేత జట్టుకు లభించే ప్రైజ్‌మనీ.
రూ. 13 కోట్లు ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచే జట్టుకు లభించే మొత్తం.
తుది జట్లు (అంచనా)
గుజరాత్ టైటాన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సాహా, శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, మిల్లర్, తెవాటియా, విజయ్ శంకర్/జోష్ లిటిల్, నూర్ అహ్మద్, షమీ, మోహిత్ శర్మ.
చెన్నై సూపర్ కింగ్స్: ధోని (కెప్టెన్), రుతురాజ్, కాన్వే, శివమ్ దూబే/పతిరణ, రహానే, రాయుడు, జడేజా, మొయిన్ అలీ, దీపక్ చహర్, తుషార్, తీక్షణ.
పిచ్, వాతావరణం
ఈ సీజన్‌లో నరేంద్ర మోదీ స్టేడియంలో పరుగుల మోత మోగింది. 8 మ్యాచ్‌ల్లో సగటు స్కోరు 193. ఇందులో ఐదుసార్లు మొదట బ్యాటింగ్ చేసి జట్లే గెలిచాయి. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
Comments
Please login to add a commentAdd a comment