గత మూడు ఒలింపిక్స్ (2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో) క్రీడల్లో పురుషుల 200 మీటర్ల విభాగంలో ఉసేన్ బోల్ట్ రూపంలో ఒక్కడే చాంపియన్‌గా నిలిచాడు. ఇతర ప్రత్యర్థులు అతనికి సమీపంలోకి రాలేకపోయారు. అయితే ఇప్పుడు బోల్ట్ లేడు. దాంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కెనడా అథ్లెట్ ఆండ్రీ డి గ్రాసీ 200 మీటర్ల పరుగులో మెరిశాడు. ‘రియో’లో రెండో స్థానంలో నిలిచి స్వర్ణాన్ని చేజార్చుకున్న గ్రాసీ... ఈసారి మాత్రం ఎటువంటి పొరపాటు చేయకుండా విజేతగా నిలిచి ఒలింపిక్ స్వర్ణ స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.
టోక్యో: నాలుగు రోజుల క్రితం జరిగిన పురుషుల 100 మీటర్ల పరుగులో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని అందుకున్న కెనడా స్ప్రింటర్ ఆండ్రీ డి గ్రాసీ అద్భుతం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగులో 19.62 సెకన్లలో గమ్యానికి చేరి బంగారు పతకంతో మెరిశాడు. దాంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ 200 మీటర్ల పరుగులో కొత్త విజేత అవతరించాడు. అంతేకాకుండా డొనోవాన్ బెయిలీ (1996 అట్లాంటా) తర్వాత స్ప్రింట్ రేసులో మళ్లీ పసిడి పతకాన్ని సాధించిన తొలి కెనడా అథ్లెట్‌గా గ్రాసీ నిలిచాడు.
ఒలింపిక్స్‌ల్లో గ్రాసీకిది ఐదో పతకం. 2016 ‘రియో’లో 100 మీటర్లు, 4్ఠ100 మీటర్ల టీమ్ రిలేలో కాంస్యా లను... 200 మీటర్ల పరుగులో రజతాన్ని దక్కించుకున్నాడు. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటికే 100 మీటర్ల పరుగులో కాంస్యాన్ని నెగ్గాడు. గ్రాసీ తర్వాత 19.68 సెకన్లలో గమ్యాన్ని చేరిన కెనెత్ బెడ్నారెక్ (అమెరికా–19.68 సెకన్లు) రజతం... నోవా లైలెస్ (అమెరికా–19.74 సెకన్లు) కాంస్యం సాధించారు.
అప్పుడు చేజారింది... ఇప్పుడు దక్కింది
అది రియో ఒలింపిక్స్... 200 మీటర్ల సెమీఫైనల్–2 హీట్... గన్ ఫైరింగ్ శబ్దం వినగానే బోల్ట్ తన పరుగును ఆరంభించాడు. కొద్ది సేపటి తర్వాత తన ప్రత్యర్థులు ఎంత వెనుకగా వస్తున్నారో చూద్దాం అన్నట్లు బోల్ట్ వెనక్కి ఒక లుక్కేశాడు. ఒక్కరు మినహా మిగిలిన రన్నర్లందరూ చాలా దూరంలో ఉన్నారు. అయితే బోల్ట్ వారిని పట్టించుకోలేదు. తన వెంటే వస్తోన్న గ్రాసీపైనే దృష్టి సారించాడు. వెంటనే పరుగు వేగం పెంచాడు. అలా 19.80 సెకన్లలో రేసును ముగించి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.
అయితే గ్రాసీ కేవలం 0.2 సెకన్లు వెనుకగా రెండో స్థానంలో నిలిచి అతడు కూడా పసిడి పోరుకు క్వాలిఫై అయ్యాడు. రేసు పూర్తయ్యాక బోల్ట్... ‘నువ్వు నన్ను చాలా కష్టపెట్టావ్’ అన్నట్లు వేలితో చూపించాడు. ఫైనల్లో మాత్రం బోల్ట్ గ్రాసీకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. రేసును వేగంగా ముగించి స్వర్ణంతో మెరవగా... రెండో స్థానంలో నిలిచిన గ్రాసీ రజతంతో సరిపెట్టుకున్నాడు. అయితే సరిగ్గా ఐదేళ్ల తర్వాత బోల్ట్ లేని పరుగులో గ్రాసీ పసిడిని చేజిక్కించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment