Tokyo Olympics: 6 వరోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు | Tokyo Olympics Day 6 Updates And Highlights | Sakshi
Sakshi News home page

Tokyo Olympics Day 6: భారత్ కు మిశ్రమ ఫలితాలు

Published Wed, Jul 28 2021 7:24 AM | Last Updated on Wed, Jul 28 2021 4:36 PM

Tokyo Olympics Day 6 Updates And Highlights - Sakshi

6 వరోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు
టోక్యో ఒలంపిక్స్ లో 6 వరోజు భారత్ మిశ్రమ ఫలితాలను అందుకుంది. హాంకాంగ్‌కు చెందిన చియాంగ్ ఎంగన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-16తో వరుస గేముల్లో గెలుపొంది పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఆర్చర్ దీపికా కుమారి, మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. భారత బాక్సర్‌ పూజా రాణి 75కేజిల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. మరో వైపు ఆర్చరీ మెన్స్ సింగిల్స్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఆర్చరీ మెన్స్ సింగిల్స్‌లో ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌ ఓటమి చెందారు.మరోసారి భారత మహిళల హాకీ జట్టు నిరాశపరిచింది. గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన పూల్‌ ఏ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు వరుసగా మూడో  ఓటమి చవిచూసింది.

ఇంటి ముఖం పట్టిన సాయి ప్రణీత్
టోక్యో ఒలిపింక్స్‌లో బ్యాడ్మింటన్ ఆటగాడు సాయి ప్రణీత్ కధ ముగిసింది.పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘డి’ లీగ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన మార్క్‌ కల్జూ చేతిలో 21-14, 21-14 తేడాతో ఓడి సాయి ప్రణీత్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్ ఒలిపింక్స్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండా ఇంటి ముఖం పట్టాడు.

ప్రీక్వార్టర్స్‌ చేరిన ఆర్చర్ దీపికా కుమారి

టోక్యో ఒలింపిక్స్ లో  ఆర్చర్ దీపికా కుమారి, మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. రౌండ్‌ ఆఫ్‌ 16లో అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఫెర్నాండోజ్‌ జరిగిన మ్యాచ్‌లో 6-4 తేడాతో విజయం సాధించింది.

క్వార్టర్స్‌కు చేరిన బాక్సర్ పూజా రాణి
టోక్యో ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో  పూజా రాణి విజయం సాధించింది. మహిళల 75kgs విభాగంలో అల్గేరియాకు చెందిన ఇచ్రాక్‌ చైబ్‌ను 5-0 తేడాతో ఓడించి  పూజా రాణి క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

తొలి రౌండ్‌లో  దీపికా కుమారి ఘన విజయం
ఆర్చరీ ఉమెన్స్‌ సింగిల్స్‌లో దీపికా కుమారి తొలి రౌండ్‌లో  ఘన విజయం సాధించింది. భూటాన్‌కి చెందిన కర్మాతో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడు సెట్లలో 6-0తో  విజయం సాధించిన దీపికా కుమారి, రౌండ్ 16కి అర్హత సాధించింది.

రౌండ్‌ ఆఫ్‌ 16లో ప్రవీణ్‌ జాదవ్‌ ఓటమి
►ఆర్చరీ మెన్స్‌ సింగిల్స్‌లో ప్రవీణ్‌ జాదవ్‌ రౌండ్‌ ఆఫ్‌ 16లో నిరాశపరిచాడు. అమెరికాకు చెందిన ప్రపంచ నెంబర్‌వన్‌ ఎలిసన్‌ బ్రాడీ చేతిలో 6-0తో ఓడిపోయి నిష్క్రమించాడు. అంతకముందు రష్యాకు చెందిన బజార్జాపోవ్ గల్సాన్‌తో జరిగిన రౌండ్‌ ఆఫ్‌ 32లో ప్రవీణ్‌ జాదవ్‌ 6-0 తేడాతో గెలిచి రౌండ్‌ 16కు అర్హత సాధించాడు.

రౌండ్‌ ఆఫ్‌ 16లో తరుణ్‌దీప్‌ రాయ్‌ ఓటమి
►ఆర్చ‌రీ మెన్స్ సింగిల్స్‌లో త‌రుణ్‌దీప్ రాయ్ పోరాటం ముగిసింది. రౌండ్ ఆఫ్ 32లో గెలిచి ఆశ‌లు రేపిన అత‌డు.. రౌండ్ ఆఫ్ 16లో పోరాడి ఓడిపోయాడు. షూట్ ఆఫ్ ద్వారా విజేత‌ను తేల్చిన ఈ రౌండ్‌లో 5-6 తేడాతో ఇజ్రాయెల్ ఆర్చ‌ర్ ఇతాయ్ షానీ చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యాడు. ఐదు సెట్లు ముగిసే స‌మ‌యానికి త‌రుణ్‌దీప్‌, ఇతాయ్ చెరో ఐదు పాయింట్ల‌తో స‌మంగా నిలిచారు. రెండు, నాలుగు సెట్ల‌ను త‌రుణ్‌దీప్ గెల‌వ‌గా.. తొలి, ఐదో సెట్‌ల‌ను ఇతాయ్ గెలిచాడు. మూడో సెట్‌లో ఇద్ద‌రికీ ఒక్కో పాయింట్ వ‌చ్చింది. దీంతో షూట్ ఆఫ్ త‌ప్ప‌లేదు. ఇందులో ఇతాయ్ ప‌ర్ఫెక్ట్ 10 సాధించ‌గా.. త‌రుణ్ 9 స్కోరు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు.

ప్రిక్వార్టర్స్‌ చేరిన పీవీ సింధు
►స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూఫ్‌ జెలో భాగంగా హాంకాంగ్‌కు చెందిన చియాంగ్ ఎంగన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-9, 21-16తో వరుస గేముల్లో గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇక ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో పోటీ పడనుంది. ఒక వేళ క్వార్టర్స్‌కు చేరుకుంటే అక్కడ అకానే యమగుచితో తలపడనుంది.

భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా మూడో ఓటమి
►టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా గ్రేట్‌ బ్రిటన్‌తో జరిగిన పూల్‌ ఏ మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు ఓటమి పాలైంది. తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన గ్రేట్‌ బ్రిటన్‌ 4-1 తేడాతో భారత మహిళల జట్టును చిత్తుగా ఓడించింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్‌లు ఓడడంతో భారత మహిళల హాకీ జట్టు క్వార్టర్స్‌కు చేరే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. భారత​ మహిళల జట్టు తమకు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవడంతో పాటు ప్రత్యర్థి జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక గ్రేట్‌ బ్రిటన్‌ తరపున మార్టిన్‌ హెచ్‌ ఆట 2, 19వ నిమిషంలో, ఎల్‌ ఓస్లే 41వ నిమిషంలో, బాల్స్‌డన్‌ 57వ నిమిషంలో గోల్స్‌ చేయగా.. భారత్‌ తరపున ఎస్‌ దేవి ఆట 7వ నిమిషంలో గోల్‌ చేసింది.


ఆర్చరీలో తరుణ్‌దీప్‌ ముందంజ
►ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో తరుణ్‌దీప్‌ రాయ్‌ ముందంజలో ఉన్నాడు. ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సీ హన్బిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-4 తేడాతో ఓడించి రౌండ్‌ ఆఫ్‌ 32కు క్వాలిఫై అయ్యాడు.

నేటి ఒలింపిక్స్‌లో భారత షెడ్యూల్‌:
ఉదయం 6.30కి మహిళల హాకీ (భారత్ Vs గ్రేట్ బ్రిటన్)
ఉ.7.30కి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్(సింధు Vs యి చియాంగ్)
ఉ.7.30కి ఆర్చరీ వ్యక్తిగత విభాగం(తరుణ్ దీప్‌రాయ్)
ఉదయం 8 గంటలకు రోయింగ్, 8.35 గంటలకు- సెయిలింగ్
మ.12.30కి ఆర్చరీ వ్యక్తిగత విభాగం(ప్రవీణ్ జాదవ్)
మ.2.14కి ఆర్చరీ వ్యక్తిగత విభాగం(దీపికా కుమారి)
మ.2.30కి బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్(సాయిప్రణీత్)
మ.2.33 గంటలకు మహిళల బాక్సింగ్(పూజారాణి)

టోక్యో: స్వర్ణ పతకమే లక్ష్యంగా టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు కీలకపోరుకు సమాయత్తమైంది. నేడు జరిగే మహిళల సింగిల్స్‌ గ్రూప్‌ ‘జె’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఎన్‌గాన్‌ యి చెయుంగ్‌ (హాంకాంగ్‌)తో సింధు తలపడనుంది. ముగ్గురు సభ్యులున్న గ్రూప్‌ ‘జె’లో సింధు, ఎన్‌గాన్‌ చెరో మ్యాచ్‌లో గెలుపొంది రెండు పాయింట్లతో సమఉజ్జీగా ఉన్నారు. ఇదే గ్రూప్‌లో ఉన్న సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్‌) రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి నిష్క్రమించింది. సింధు, ఎన్‌గాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌ విజేత గ్రూప్‌ ‘జె’ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత పొందుతారు.

ప్రపంచ 34వ ర్యాంకర్‌ ఎన్‌గాన్‌తో గతంలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ సింధునే విజయం వరించింది. అయితే ఒలింపిక్స్‌లాంటి అత్యున్నత వేదికపై ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. మరోవైపు పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘డి’ లీగ్‌ మ్యాచ్‌లో మార్క్‌ కల్జూ (నెదర్లాండ్స్‌)తో సాయిప్రణీత్‌ తలపడతాడు. ఈ మ్యాచ్‌లో సాయిప్రణీత్‌ వరుస గేముల్లో గెలిచినా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత పొందే అవకాశం లేదు. తొలి మ్యాచ్‌లో మిషా జిల్బెర్‌మన్‌ (ఇజ్రాయెల్‌) చేతిలో సాయిప్రణీత్‌ వరుస గేముల్లో ఓడిపోవడం అతని అవకాశాలను దెబ్బతీసింది. ఒకే గ్రూప్‌లో ముగ్గురు సమఉజ్జీగా నిలిస్తే మెరుగైన గేమ్‌ల సగటు ఉన్నవారు ముందంజ వేస్తారు. ప్రస్తుతం కల్జూ, మిషా +1 గేమ్‌లతో ఆధిక్యంలో ఉండగా... సాయిప్రణీత్‌ –2 గేమ్‌లతో వెనుకబడి ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement