మనూ భాకర్, సౌరభ్ చౌదరీ
టోక్యో: ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైన తొలి రోజు నుంచి భారత షూటర్లపై క్రీడాభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏకంగా 15 మంది భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందడం... కొంతకాలంగా అంతర్జాతీయస్థాయి టోర్నీలలో నిలకడగా పతకాలు సాధిస్తుండటం... ఈ నేపథ్యంలో సహజంగానే మన షూటర్లు రియో ఒలింపిక్స్ వైఫల్యాన్ని మరిచిపోయేలా పతకాలతో అదరగొడతారని ఆశించారు. కానీ మూడు రోజులు గడిచినా భారత షూటర్లు పతకాల బోణీ కొట్టలేకపోయారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సౌరభ్ చౌదరీ ఒక్కడే కాస్త నయమనిపించి ఫైనల్ చేరుకున్నాడు. కానీ తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న అతను ఒత్తిడికి తడబడి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఇదే విభాగంలో మరో షూటర్ అభిషేక్ వర్మ క్వాలిఫయింగ్‌ను దాటలేకపోయాడు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో ఇలవేనిల్, అపూర్వీ చండేలా... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో దివ్యాంశ్, దీపక్ కుమార్... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మనూ భాకర్, యశస్విని... పురుషుల స్కీట్ ఈవెంట్‌లో అంగద్, మేరాజ్ అహ్మద్ ఖాన్ కూడా క్వాలిఫయింగ్‌లోనే నిష్క్రమించారు. దాంతో యేటా ప్రపంచకప్ టోర్నీలలో కనబరిచే ప్రదర్శనను విశ్వ క్రీడలు వచ్చేసరికి భారత షూటర్లు పునరావృతం చేయలేక చతికిల పడతారని విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం విమర్శకుల నోళ్లు మూయించడానికి భారత షూటర్లకు మంచి అవకాశం లభించనుంది. తొలిసారి ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టిన మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత్ నుంచి నాలుగు జోడీలు బరిలోకి దిగనున్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో మనూ భాకర్–సౌరభ్ చౌదరీ; యశస్విని–అభిషేక్ వర్మ... 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ విభాగంలో ఇలవేనిల్–దివ్యాంశ్; దీపక్ కుమార్–అంజుమ్ మౌద్గిల్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ స్టేజ్–1లో మొత్తం 20 జోడీలు బరిలో ఉన్నాయి.
ఇలవేనిల్, దివ్యాంశ్ సింగ్
స్టేజ్–1లో టాప్–8లో నిలిచిన ఎనిమిది జంటలు క్వాలిఫయింగ్ స్టేజ్–2కు అర్హత సాధిస్తాయి. స్టేజ్–2లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జోడీలు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ స్టేజ్–1లో 29 జోడీలు పోటీపడతాయి. టాప్–8లో నిలిచిన జంటలు క్వాలిఫయింగ్ స్టేజ్–2కు అర్హత పొందుతాయి. స్టేజ్–2లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జోడీలు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడతాయి. ఈ ఏడాది న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో సౌరభ్–మనూ జంట స్వర్ణం... యశస్విని–అభిషేక్ జోడీ కాంస్యం సాధించాయి. ఒలింపిక్స్‌లో ఈ జోడీలు ఏం చేస్తాయో వేచి చూడాలి.
గెలిస్తే సాత్విక్–చిరాగ్ జంట ముందుకు...
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో బెన్ లేన్–సీన్ వెండీ (బ్రిటన్) జంటపై కచ్చితంగా గెలవాలి. ఈ గ్రూప్ నుంచి వరుసగా రెండు విజయాలతో గిడియోన్–కెవిన్ సంజయ (ఇండోనేసియా) జంట ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరింది.
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లీగ్ మ్యాచ్: ఉదయం గం. 8:30 నుంచి
బాక్సింగ్
♦మహిళల 69 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్: లవ్లీనా బొర్గోహైన్ (భారత్)–నాదినె ఎపెట్జ్ (జర్మనీ)
♦ఉదయం గం. 11.33 నుంచి
టేబుల్ టెన్నిస్
♦టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్: శరత్ కమల్–మా లాంగ్ (చైనా)
♦ఉదయం గం. 8:30 నుంచి
సెయిలింగ్
♦మహిళల లేజర్ రేడియల్ రేసు: నేత్రా కుమనన్ (ఉదయం గం. 8:35 నుంచి); పురుషుల లేజర్ రేసు: విష్ణు శరవణన్ (ఉదయం గం. 8:45 నుంచి); పురుషుల స్కిఫ్ 49ఈఆర్ ♦రేసు: కేసీ గణపతి–వరుణ్ ఠక్కర్ (ఉదయం గం. 11:50 నుంచి)
పురుషుల హాకీ
♦పురుషుల హాకీ పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్: భారత్–స్పెయిన్
♦(ఉదయం గం. 6:30 నుంచి)
10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్
♦క్వాలిఫయింగ్ స్టేజ్–1: ఉదయం గం. 5:30 నుంచి; క్వాలిఫయింగ్ స్టేజ్–2: ఉదయం గం. 6:15 నుంచి; కాంస్య పతకం మ్యాచ్: ఉదయం గం. 7:30 నుంచి; స్వర్ణ–రజత పతక మ్యాచ్: ఉదయం గం. 8:37 నుంచి
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్
♦క్వాలిఫయింగ్ స్టేజ్–1: ఉదయం గం. 9:45 నుంచి; క్వాలిఫయింగ్ స్టేజ్–2: ఉదయం గం. 10:30 నుంచి; కాంస్య పతకం మ్యాచ్: ఉ. గం. 11:45 నుంచి; స్వర్ణ–రజత పతక మ్యాచ్: మధ్యాహ్నం గం. 12:22 నుంచి.
Comments
Please login to add a commentAdd a comment