న్యూఢిల్లీ: ఐదేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయి, తినడానికి తిండికూడా లేని దుర్భరస్థితిలో నుంచి తారా జువ్వలా దూసుకొచ్చిన తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల స్ప్రింటర్ రేవతి వీరమణి.. త్వరలో ప్రారంభంకాబోయే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆశాకిరణంలా మారింది. ఒలింపిక్స్ శిక్షణ శిబిరంలో ప్రియా మోహన్, పూవమ్మ, వీకే విస్మయ, జిస్నా మాథ్యూలు ఫామ్‌లో లేకపోవడంతో 400 మీటర్ల మిక్స్‌డ్ రిలే జట్టులో ముగ్గురు మహిళా రన్నర్ల కోసం అథ్లెటిక్స్ సమాఖ్య సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహించింది. ఇందులో 53.55 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంలో అగ్రస్థానంలో నిలిచిన రేవతి.. ఒలింపిక్స్ రిలే జట్టులో స్థానం దక్కించుకుంది.
2019 వరకు కన్నన్ వద్ద శిక్షణ పొందిన రేవతి అనంతరం పటియాలలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్‌ఐఎస్)లో జాతీయ శిబిరానికి ఎంపికైంది. అప్పటివరకు 100, 200 మీ.లలో పరిగెత్తిన ఆమె.. ఎన్‌ఐఎస్ కోచ్ గలినా బుఖారియా సలహాతో 400మీ.కు మారింది. 2019 ఫెడరేషన్ కప్‌లో 200 మీటర్ల విభాగంలో సిల్వర్ మెడల్ నెగ్గిన రేవతి.. ఇండియన్ గ్రాండ్ ప్రీ 5,6లో 400 మీ.లో స్వర్ణ పతకాలు గెలిచింది. అనంతరం 2021లో జరిగిన గ్రాండ్‌ప్రీ-4లో 400 మీ. విజేతగా నిలిచింది.
ఇదిలా ఉంటే, రేవతి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే అనారోగ్యంతో మరణించారు. దాంతో మధురైలో నివసించే అమ్మమ్మ వద్దకు రేవతి, ఆమె చెల్లెలు చేరారు. స్కూల్లో ఉన్న సమయంలో పరుగులో రేవతి ప్రతిభను గమనించిన తమిళనాడు స్పోర్ట్స్ డెవల్‌పమెంట్ అథారిటీ కోచ్ కన్నన్ ఆమె నైపుణ్యాలకు మెరుగులు దిద్దాడు. అంతేకాదు మధురైలోని లేడీ డాక్ కాలేజీలో ఆమెకు సీటుతోపాటు, హాస్టల్ వసతి లభించేలా సాయం చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బూట్లు లేకుండానే ప్రాక్టీస్ చేసిన రేవతి.. అనేక కాలేజీ మీట్‌లతో పాటు 2016 జూనియర్ నేషనల్స్‌లో ఉత్తి కాళ్లతోనే పరుగెత్తి విజయాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment