IND VS AUS: హెడ్‌కు అచ్చిరాని గబ్బా​.. హ్యాట్రిక్‌ డకౌట్లు | TRAVIS HEAD GOLDEN DUCK OUT IN LAST 3 INNINGS AT GABBA IN TEST | Sakshi
Sakshi News home page

IND VS AUS: హెడ్‌కు అచ్చిరాని గబ్బా​.. హ్యాట్రిక్‌ డకౌట్లు

Published Fri, Dec 13 2024 3:48 PM | Last Updated on Fri, Dec 13 2024 3:59 PM

TRAVIS HEAD GOLDEN DUCK OUT IN LAST 3 INNINGS AT GABBA IN TEST

ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌కు బ్రిస్బేన్‌లోని గబ్బా పిచ్‌ అస్సలు అచ్చిరాదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వేదికపై హెడ్‌ ఆడిన గత మూడు టెస్ట్‌ ఇన్నింగ్స్‌ల్లో గోల్డెన్‌ డకౌట్లయ్యాడు. గబ్బాలో హెడ్‌ వైఫల్యాల పరంపర 2022లో మొదలైంది. ఆ ఏడాది సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హెడ్‌ కగిసో రబాడ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 

అనంతరం​ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్‌ కీమర్‌ రోచ్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. గబ్బాలో హెడ్‌ మూడో గోల్డెన్‌ డకౌట్‌ కాస్త వైవిధ్యంగా జరిగింది. విండీస్‌ యువ పేసర్‌ షమార్‌ జోసఫ్‌ వేసిన అద్భుతమైన యార్కర్‌కు హెడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

భారత్‌పై ఫార్మాట్లకతీతంగా రెచ్చిపోయే హెడ్‌, గబ్బా పిచ్‌పై మరోసారి డకౌటవుతాడా లేక యధావిధిగా తన ఫామ్‌ను కొనసాగిస్తాడా అన్నది వేచి చూడాల్సి ఉంది. హెడ్‌ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో ఇటీవల ముగిసిన అడిలైడ్‌ టెస్ట్‌లో మెరుపు వేగంతో 141 పరుగులు చేశాడు. 

మరోవైపు గబ్బాలో భారత్‌ మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఈ ట్రాక్‌పై టీమిండియా గత పర్యటనలో ఆసీస్‌పై సంచలన విజయం సాధించింది. నాటి మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ (89 నాటౌట్‌) ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్‌ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1  తేడాతో కైవసం చేసుకుంది. 

కాగా, భారత్‌-ఆస్ట్రేలియా మధ్య గాబ్బా వేదికగా జరుగబోయే మూడో టెస్ట్‌ డిసెంబర్‌ 14 నుంచి ప్రారంభం​ కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌, ఆస్ట్రేలియా చెరో మ్యాచ్‌ గెలిచిన విషయం తెలిసిందే. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్‌ 295 పరుగుల తేడాతో గెలుపొందగా.. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement