Gabba Stadium
-
శభాష్ షామర్.. సెక్యూరిటీ గార్డు టూ 'గబ్బా' హీరో
దాదాపు రెండేళ్ల క్రితం అతను బతుకుతెరువు కోసం ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అయితే క్రికెట్‌పై పిచ్చి ఈ ఉద్యోగంలో నిలవనీయడం లేదు. ఇలాగే సాగితే తన జీవితం సెక్యూరిటీకే అంకితం అయిపోతుందని అతను భయపడ్డాడు. ఏదో సాహసం చేయాల్సిందేనని భావించాడు. కానీ ఒక్కసారిగా ఇంటి కష్టాలు కళ్ల ముందు నిలిచాయి. అయితే అతడి కలను నెరవేర్చేందుకు కుటుంబం అండగా నిలుస్తూ ధైర్యాన్ని నిపించింది. దాంతో దేనికైనా సిద్ధమే అంటూ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెడుతూ తన సాధన కొనసాగించాడు. రెండేళ్ల తర్వాత చూస్తే ప్రతిష్ఠాత్మక బ్రిస్బేన్ మైదానంలో ఆస్ట్రేలియా బ్యాటర్లను తన బౌలింగ్‌లో ఒక ఆటాడించాడు. తమకు ఘనమైన రికార్డు ఉన్న గాబా మైదానంలో ఆసీస్ ఆటగాళ్లు అతని బౌలింగ్ ముందు తలవంచారు. వేగవంతమైన బంతులతో చెలరేగిపోతుంటే జవాబు ఇవ్వలేక బ్యాట్లు ఎత్తేశారు. ఫలితంగా వెస్టిండీస్‌కు చిరస్మరణీయ విజయం. 24 ఏళ్ల ఆ బౌలర్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఎక్కడో గయానా అడవుల్లో పుట్టి పెరిగి ఈ స్థాయికి వచ్చిన ఆ కుర్రాడే పేస్ బౌలర్ షామర్ జోసెఫ్. అతని నేపథ్యం, ఆపై ఎదిగిన తీరు అసమానం, స్ఫూర్తిదాయకం. జనవరి 17, 2024...అంతర్జాతీయ క్రికెట్లో షామర్ జోసెఫ్ అరంగేట్రం చేసిన రోజు. అడిలైడ్ మైదానంలో తీవ్ర ఒత్తిడిలో తన మొదటి ఓవర్ వేసేందుకు అతను తన బౌలింగ్ రనప్ మొదలు పెట్టాడు. ఎదురుగా బ్యాటింగ్ చేస్తున్నది టెస్టు క్రికెట్ ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన స్టీవ్ స్మిత్. గుడ్ లెంగ్త్‌లో ఆఫ్‌స్టంప్‌పై పడిన బంతిని డిఫెన్స్ ఆడబోయిన స్మిత్ దానిని నియంత్రించలేక మూడో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. అంతే... ఒక్కసారిగా విండీస్ శిబిరంలో సంబరాలు. టెస్టుల్లో తాను వేసిన తొలి బంతికే వికెట్ తీసిన అత్యంత అరుదైన ఆటగాళ్ల జాబితాలో షామర్ చేరాడు. ఈ క్షణాన్ని ఫోటో ఫ్రేమ్ చేసిన తన ఇంట్లో పెట్టుకుంటానని అతను ప్రకటించాడు. అయితే ఆ ఆనందం అంతటితో ఆగిపోలేదు. మరో 11 రోజుల తర్వాత అది రెట్టింపైంది. 216 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 113 పరుగులకు 2 వికెట్లతో పటిష్ఠ స్థితిలో నిలిచిన దశలో షామర్ స్పెల్ కంగారూలను కుప్పకూల్చింది. విరామం లేకుండా బౌలింగ్ చేసిన అతను 7 వికెట్లతో ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిక్యం కనబర్చాడు. ఎప్పుడో షామర్ పుట్టక ముందే 27 ఏళ్ల క్రితం ఆసీస్‌ను వారి సొంతగడ్డపై విండీస్ ఆఖరిసారిగా ఓడించింది. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్లకు ఒక గెలుపు. ఇన్నాళ్లుగా ఒక విజయం కోసం ఎదురు చూస్తూ వచ్చిన నాటి దిగ్గజాలు బ్రియాన్ లారా, కార్ల్ హూపర్ కన్నీళ్లపర్యంతమవగా షామర్ వారి ముందు ఒక అద్భుతం చేసి చూపించాడు. సాధారణంగా తమను ఓడించిన ప్రత్యర్థులపై కసితో ఆమడ దూరం ఉండి ఆగ్రహాన్ని ప్రదర్శించే ఆసీస్ ఆటగాళ్లు కూడా బీరు గ్లాసులతో వేడుకల్లో జత కలిశారు. ఎందుకంటే ఈ విజయం విలువేమిటో అందరికీ తెలియడమే కాదు, షామర్ జోసెఫ్ గురించి తెలుసుకున్న తర్వాత వారందరూ మనస్ఫూర్తిగా అభినందించారు. కట్టెలు కొట్టడంతో మొదలై... గయానా దేశంలో న్యూ ఆమ్స్టర్డామ్ ఒక చిన్న పట్టణం. దాదాపు 20 వేల జనాభా ఉంటుంది. బెర్బిస్ నదీ తీరంలో ఈ పట్టణం ఉంటుంది. బెర్బిస్ ఉప నది కాంజే ద్వారా అక్కడి నుంచి దాదాపు 225 కిలో మీటర్లు పడవలో రెండు రోజుల పాటు ప్రయాణిస్తే, బరాకారా అనే చిన్న ఊరు వస్తుంది. జనాభా దాదాపు 400 మంది. ఇటీవలి వరకు అక్కడ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ అనే పేరు కూడా తెలీదు. ఊర్లో అందరికీ ఒకటే వృత్తి.. అడవిలోకి వెళ్లి చెట్లు కొట్టడం, వాటిని దుంగలుగా కట్టకట్టి కాంజే నది ద్వారానే న్యూ ఆమ్స్టర్డామ్ వరకు చేర్చి నాలుగు డబ్బులు సంపాదించుకోవడం. షామర్ కుటుంబం కూడా అదే పనిలో ఉంది. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్ల కుటుంబంలో అతను ఒకడు. అలాగే జీవితం సాగిపోతున్న సమయంలో అనూహ్యం జరిగింది. అడవిలో పని చేస్తున్న క్రమంలో ఒక పెద్ద జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. అర క్షణం తేడాతో షామర్ చావునుంచి తప్పించుకున్నాడు. దాంతో ఈ పనిని మానేయాలని అతను వెంటనే నిర్ణయించుకున్నాడు. అయితే ఉపాధి కోసం న్యూ ఆమ్స్టర్డామ్కే వెళ్లిపోయాడు. ముందు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో లేబర్‌గా పని చేశాడు. అక్కడ ఇబ్బందులు రావడంతో ఒక బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్‌గా చేరాడు. అప్పటికే క్రికెట్‌పై ఇష్టం పెంచుకున్న షామర్ టేప్ బాల్‌తో బౌలింగ్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. అయితే వరుసగా 12 గంటల బ్యాంక్ ఉద్యోగం, అలసట కారణంగా ఆదివారాలు కూడా ఆడే అవకాశం లేకపోయేది. దాంతో ఒక గందరగోళ స్థితిలోకి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో కుటుంబం మద్దతుగా నిలిచి ప్రోత్సహించింది. ‘నువ్వు ఇష్టపడే చోట కష్టపడు’ అంటూ ఒక ప్రయత్నం చేయమని, మిగతావారంతా కుటుంబ బాధ్యతలు తీసుకుంటామని అండగా నిలిచారు. దాంతో షామర్‌కు స్వేచ్ఛ దొరికినట్లయింది. అండగా అందరూ... టేప్ బాల్, రబ్బర్ బాల్, ప్లాస్టిక్ బాల్, నిమ్మకాయలు, జామకాయలు.. ఇలా అన్నింటిలోనూ షామర్‌కు క్రికెట్ బంతే కనిపించింది. బౌలింగ్‌ను ఇష్టపడిన అతను వీటన్నంటితో ఆడుతూనే వచ్చాడు. టీవీల్లో, పోస్టర్లలో కనిపించే నాటి దిగ్గజాలు ఆంబ్రోస్, వాల్ష్లపై మొదటినుంచీ అభిమానాన్ని పెంచుకొని వారినే అనుకరించే ప్రయత్నం చేశాడు. కష్టపడేవారికే అదృష్టం కూడా అండగా నిలుస్తుందనేది వాస్తవం. షామర్ విషయంలోనూ అది నిజమైంది. వేర్వేరు దశల్లో ఎంతోమంది షామర్‌కు సహాయం చేయడంతో అతను ముందంజ వేయగలిగాడు. ఉద్యోగం వదిలేసిన తర్వాత పూర్తిస్థాయిలో క్రికెట్‌పై దృష్టి పెట్టి అవకాశం దొరికిన చోటల్లా తనలోని సహజమైన బౌలింగ్ ప్రతిభను షామర్ ప్రదర్శించాడు. ఒక రోజు విండీస్ ఆల్‌రౌండర్ రొమారియా షెఫర్డ్ దృష్టి అతనిపై పడింది. ఇతనిలో ప్రత్యేక ప్రతిభ ఉందని గుర్తించిన షెఫర్డ్ తనకు సన్నిహితులైన అందరి వద్ద షామర్ గురించి చెబుతూ వచ్చాడు. అదే అతనికి వరుసగా అవకాశాలు కల్పించింది. గయానా కోచ్ ఎసన్ క్రాన్డన్, మాజీ కెప్టెన్ లియాన్ జాన్సన్, గయానా సీపీఎల్ జట్టు ప్రతిభాన్వేషి ప్రసన్న అగోరమ్...ఇలా అందరూ షామర్‌కు అండగా నిలిచేవారే. ముఖ్యంగా తనకు తల్లీ, తండ్రి లాంటివాడు అని షామర్ చెప్పుకున్న ప్రసన్న కారణంగానే తొలిసారి పెద్ద స్థాయిలో అతనికి క్రికెట్ టోర్నీ అవకాశం దక్కింది. ముందుగా డివిజన్ స్థాయి క్రికెట్లో బరిలోకి దిగి సత్తా చాటడంతో ఆ తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి చాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. తన పదునైన పేస్ బౌలింగ్‌ను మాత్రమే నమ్ముతున్న షామర్‌కు మరో సిఫారసు అవసరం లేకుండా పోయింది. సీపీఎల్‌లో చెలరేగడంతో గయానా తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అవకాశం దక్కింది. ఏడాది తిరిగేలోగా వెస్టిండీస్ సీనియర్ జట్టులోకి ఎంపిక కావడం అతని పురోగతిని చూపిస్తోంది. ప్రతికూల పరిస్థితిని జయించి... షామర్ను హీరోగా మార్చిన బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్ చేయగలగడమే అనూహ్యం. అంతకు ముందు రోజు బ్యాటింగ్ చేస్తుండగా స్టార్క్ వేసిన యార్కర్‌కు అతని కాలి వేలికి తీవ్ర గాయమైంది. దాంతో మ్యాచ్ బరిలోకి దిగడమే సందేహంగా మారింది. అందుకే జట్టుతో పాటు మైదానంలోకి టీమ్ డ్రెస్‌తో కాకుండా క్యాజువల్‌గా వచ్చేశాడు. అయితే డాక్టర్ నొప్పి నివారణ ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత మళ్లీ ఆడాలనే ఆలోచన కలిగింది. తన జట్టును ఓటమి నుంచి రక్షించేందుకు ఏదైనా చేయగలననే నమ్మకంతో అతను బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. ఏం జరిగినా ఆఖరి వికెట్ పడే వరకు నేను బౌలింగ్ ఆపను అంటూ కెప్టెన్ బ్రాత్వైట్కు చెప్పాడు. దాంతో హడావిడిగా సహాయక సిబ్బంది డ్రెస్ కోసం హోటల్ గదికి పరుగెత్తగా సహచరుడు జాకరీ మెకస్కీ జెర్సీని తీసుకున్న షామర్ నంబర్‌పై స్టికర్ అంటించి అంపైర్ అనుమతితో బరిలోకి దిగాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లు ముగిశాయి. చక్కగా ఆడుతున్న జట్టు విజయం దిశగా వెళుతోంది. 29వ ఓవర్‌తో షామర్ తన బౌలింగ్‌ను మొదలు పెట్టాడు. అంతే...కెప్టెన్‌కు మాట ఇచ్చినట్లుగా వరుసగా 11.5 ఓవర్లు వేసి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఒకటి, రెండు, మూడు.. ఇలా మొదలై చివరకు ఏడో వికెట్‌కు విండీస్‌ను గెలిపించి విజయనాదం చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. టెస్టు క్రికెటర్‌గా షామర్ ఆట ఇప్పుడే మొదలైంది. రాగానే సంచలనం సృష్టించినా, ఆటగాడిగా ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అవరోధాలను దాటి, గాయాలను అధిగమించి పెద్ద కెరీర్ నిర్మించుకోవడం అంత సులువు కాదు. పైగా విండీస్‌లాంటి బలహీనమైన జట్టు తరఫున ఎప్పుడూ అద్భుతాలు సాధ్యం కావు. అయితే షామర్లో ప్రతిభను చూస్తే అతను ఈ ఒక్క ఘనతకే పరిమితం కాడనేది అంచనా. అన్నింటినీ మించి ఫలితాలను పక్కన పెడితే అతను ప్రస్తుతం సగర్వంగా నిలిచేందుకు సాగించిన ప్రస్థానం మాత్రం ఆటల్లో ఎదగాలనుకునే అందరికీ ప్రేరణ ఇస్తుందనేది మాత్రం వాస్తవం. ∙మొహమ్మద్ అబ్దుల్ హాది -
Ashes Series: ఓవైపు మ్యాచ్.. మరోవైపు ప్రపోజల్.. ముద్దుల్లో ముంచెత్తి..
Ashes Series: A Fan Proposes To His Girlfriend During 1st Test Video Viral: మనసుకు నచ్చిన అమ్మాయి ముందు ప్రేమను వ్యక్తపరిచే అపురూప క్షణాలను కలకాలం పదిలం చేసుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి. యాషెస్ వంటి ప్రతిష్టాత్మక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న గబ్బాను ఇందుకు వేదిక చేసుకున్నాడు. మోకాళ్లపై కూర్చుని గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసి ఆమె అంగీకారం పొందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రిస్బేన్‌లోని గబ్బాలో ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడో రోజు ఆటలో భాగంగా... ఫ్యాన్స్ అంతా మ్యాచ్ వీక్షిస్తుండగా.. రాబ్ అనే వ్యక్తి మాత్రం తన పనిలో తాను తలమునకలైపోయాడు. ప్రేయసి నాట్ ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తీసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ హఠాత్పరిణామానికి తొలుత ఆశ్చర్యపోయిన నాట్.. వెంటనే తేరుకుని ఓకే అంది. రాబ్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ముద్దుల్లో ముంచెత్తింది. ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతూ వారి ప్రేమను ఆశీర్వదించారు. మరికొంత మంది సెల్ఫోన్లలో ఈ దృశ్యాలను బంధిస్తూ విషెస్ చెప్పారు. మీరు కూడా ఓ లుక్కేయండి మరి! She said yes! How good! pic.twitter.com/Mc7erNaeYO — 7Cricket (@7Cricket) December 10, 2021 Feeling the love 🥰@Holly_Ferling catches up with Rob & Nat, the newly engaged couple! pic.twitter.com/CkNvFnETbO — 7Cricket (@7Cricket) December 10, 2021 చదవండి: Ashes Series 2021: ‘శవాన్ని కాల్చేస్తారు.. బూడిదను తీసుకువెళ్తారు’.. బ్లిగ్ పెళ్లి.. అసలు బూడిద ఉన్న ట్రోఫీ ఎక్కడ? -
'ఆ టెస్టు నాకు ప్రత్యేకం.. అందుకే కుక్కకు ఆ పేరు'
చెన్నై: కెరీర్ తొలి టెస్టు అంటే ఏ క్రికెటర్‌కైనా ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అదే ఆ మ్యాచ్‌లో చిరస్మరణీయ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తే ఇక ఆ మైదానం, వేదిక సహజంగానే చిరస్మరణీయంగా మారిపోతుంది. ఏదో రూపంలో దానిని రోజూ గుర్తు చేసుకునేవారు చాలా మంది. ఇప్పుడు భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా అదే పని చేశాడు. తన తొలి టెస్టు ఆడిన బ్రిస్బేన్‌లోని ‘గాబా’ మైదానం పేరునే తన బుజ్జి కుక్క పిల్లకు పెట్టుకున్నాడు! మా ఇంట్లోకి కొత్త సభ్యుడి ఆగమనం అంటూ ‘గాబా’ను పరిచయం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన సుందర్... శార్దుల్‌తో కలిసి ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించాడు. భారత్ స్కోరు 186/6గా ఉన్న దశలో వచ్చిన ఈ భాగస్వామ్యం చివర్లో కీలకంగా మారి జట్టు గెలుపునకు కారణమైంది. అన్నట్లు... 1993లో ఆస్ట్రేలియాపై సిడ్నీ వేదికగా తన తొలి టెస్టు సెంచరీ (277) చేసిన దిగ్గజం బ్రియాన్ లారా తన కూతురుకు ‘సిడ్నీ’ అని పేరు పెట్టిన విషయాన్ని ఇది గుర్తు చేసింది! చదవండి: సుందర్, బెయిర్ స్టో గొడవ.. అంపైర్ జోక్యం ఇంకా రెండు, మూడేళ్లు ఆడతా: ఉమేశ్ యాదవ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ఇంకో రెండు మూడేళ్లు కొనసాగిస్తానని భారత సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ చెప్పాడు. జూన్‌లో న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెట్టానని 33 ఏళ్ల ఉమేశ్ అన్నాడు. ఇప్పటివరకు 48 టెస్టులు ఆడిన ఉమేశ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. వన్డేలకు పూర్తిగా దూరమైన ఇతన్ని సెలక్టర్లు ఇప్పుడు కేవలం టెస్టు జట్టుకే పరిగణిస్తున్నారు. చదవండి: ఆ విషయంలో సుందర్ నాకంటే సమర్ధుడు -
గబ్బా విజయం: రవిశాస్త్రి చెప్పిన మంత్రమిదే
ముంబై: గబ్బాలో టీమిండియా 32 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. పింక్ బాల్ టెస్ట్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భారత జట్టు.. 40 రోజుల వ్యవధిలో.. అదే ఆస్ట్రేలియాను బ్రిస్బెన్ టెస్ట్‌లో మట్టి కరిపించింది. కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికి చారిత్రాత్మక విజయం సాధించిన బ్రిస్బేన్ టెస్ట్‌కు ప్రత్యేకతలేన్నో. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నటీ లీవ్‌లో ఉన్నాడు.. ఇక సీనియర్ ఆటగాళ్లను గాయాలు వెంటాడాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అజింక్య రహానే ఆధ్వర్యంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు గబ్బా వేదికగా చరిత్రని తిరగరాసింది. పింక్ బాల్ ఓటమికి బదులు తీర్చుకుంది. ఈ నేపథ్యంలో గబ్బా విజయానికి సంబంధించిన ఓ ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. టీమిండియా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తన యూట్యూబ్ చానెల్లో రవిచంద్రన్ అశ్విన్‌తో జరిగిన సంభాషణలో ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేసిన ప్రసంగం అడిలైడ్‌లో ఎదుర్కొన్న ఓటమి నుంచి టీమిండియా అదృష్టాన్ని ఎలా మలుపు తిప్పిందో వెల్లడించారు. (చదవండి: క్రికెటర్స్.. ‘గేమ్’చేంజర్స్..!) ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘36 ఆలౌట్ తరువాత ఏం జరిగిందో మీకు తెలియదు. అప్పుడు రవి (శాస్త్రి) భాయ్ జట్టు సభ్యులను పిలిచి ఇలా అన్నాడు.. ‘‘ఈ 36 ను మీ స్లీవ్స్‌లో బ్యాడ్జ్ లాగా ధరించండి.. ఆ ఓటమి మీలో కసి పెంచుతుంది. మీ ఆట తీరు మారుతుంది. ఇక చూడండి మీరు గొప్ప జట్టు అవుతారు’’ అన్నాడు. 40 రోజుల వ్యవధిలో రవిశాస్త్రి మాటలు నిజం అయ్యాయి. అలాగే, అడిలైడ్ టెస్ట్ అనంతరం రెండు రోజుల వ్యవధిలో మేము ఐదు సార్లు సమావేశం అయ్యాం. విరాట్ (కోహ్లీ), జింక్స్ (అజింక్య రహానె), కోచింగ్ సిబ్బంది కాంబినేషన్స్ గురించి చర్చించారు. విరాట్ కొన్ని అద్భుతమైన సూచనలు ఇచ్చాడు. వాటన్నింటి ఫలితమే ఈ విజయం’’ అన్నారు శ్రీధర్. (నన్ను ఎవరితోనూ పోల్చకండి: పంత్) -
రథంపై నటరాజన్.. సెహ్వాగ్ రియాక్షన్
ముంబై: ఆస్ట్రేలియా టూర్‌ను విజయవంతంగా ముగించి.. ట్రోఫితో ఇండియాకు చేరుకున్న భారత జట్టుకు దేశం యావత్తు ఘన స్వాగతం పలికింది. విమానాశ్రయ సిబ్బందితో సహా అభిమానులు, ప్రయాణికులు వారికి ఘన స్వాగతం పలకగా.. ఇక తమిళ సీమర్ నటరాజన్‌కు సొంతూర్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. అతడి కోసం రథం ఏర్పాటు చేసి.. ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొనడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. ‘‘ఇది ఇండియా. ఇక్కడ క్రికెట్ అంటే కేవలం ఓ ఆట మాత్రమే కాదు.. అంతకు మించి. నటరాజన్‌కు తన గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. వ్వాటే స్టోరీ’’ అనే క్యాప్షన్‌తో వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సారి షేర్ చేశారు సెహ్వాగ్. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకోవడంతో పాటు 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో అపజయం అంటూ తెలియని ఆసీస్ రికార్డును బ్రేక్ చేస్తూ టీమిండియా చరిత్రను తిరగరాసింది. (చదవండి: ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు) -
ఆసీస్ అభిమాని నోట భారత్ మాతాకీ జై.. వైరల్
బ్రిస్బేన్: 32 ఏళ్లుగా గబ్బా స్టేడియంలో ఓటమే ఎరుగని ఆస్ట్రేలియా జట్టును టీమిండియా కంగారుపెట్టించింది. 328 రికార్డు లక్ష్యాన్ని ఛేదించి అటు టెస్టును ఇటు సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. కీలక ఆటగాళ్లు గాయాల గండంలో చిక్కుకున్నా అద్వితీయమైన ఆటతో రహానే సేన సగర్వంగా రెండోసారి బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ముద్దాడింది. ఆసమయంలో 130 కోట్ల భారతీయుల గుండె ఉప్పొంగింది. దాంతోపాటు ఇతర దేశాల క్రికెట్ అభిమానులు, క్రీడా విశ్లేషకులు టీమిండియా పోరాటపటిమను కొనియాడారు. ఆసీస్ ఆటగాళ్లు, కోచ్ సైతం ఇండియన్ క్రికెటర్లను తక్కువ అంచనా వేయొద్దని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో పేర్కొన్నారు. ఈక్రమంలో తమ జట్టు ఓటమిపాలైనప్పటికీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ అభిమాని టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: 'గాబా’ మైదానంలో కొత్త చరిత్ర..) గబ్బా స్టేడియంలో అభిమానుల గ్యాలరీ నుంచి ‘భారత్ మాతాకి జై’, ‘వందే మాతరం’ అంటూ స్లోగన్స్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా, బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమిండియా మూడు వికెట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 369 పరుగులు చేయగా.. భారత్ 336 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 33 పరుగుల ఆధిక్యంతో కలిపి ఆసీస్ ఓవరాల్‌గా భారత్ ముందు 328 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శుభ్‌మన్ గిల్ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు), రిషభ్ పంత్ (138 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించి భారత్‌కు విజయాన్ని అందించారు. (చదవండి: కరోనా : సానియా మీర్జా భావోద్వేగం) -
ఈ రికార్డులు చూస్తే తెలుస్తుంది గబ్బా కథ!
బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత్ ముందు ఆసీస్ గట్టి సవాల్ విసిరింది. తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆదిక్యంతో కలిపి ఓవరాల్‌గా 328 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు టీమిండియా ముందుంచింది. అయితే, ఇంకా ఒకరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటం.. ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఇప్పుడు రహానే సేన ముందున్న పరీక్ష. తొలి ఇన్నింగ్స్‌లో టాప్, మిడిల్ ఆర్డర్ విఫలమైనా లోయర్ మిడిల్ ఆర్డర్ రాణించడంతో భారత్ పోటీలో ఉంది. లేదంటే ఇప్పుడున్న టార్గెట్ కంటే మరో సెంచరీ పరుగుల లక్ష్యం మన ముందుండేది. వాషింగ్టన్ సుందర్ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), శార్దూల్ ఠాకూర్ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇద్దరూ ఏడో వికెట్‌కు విలువైన 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసి ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 369. (చదవండి: కీలక వికెట్లు కూల్చిన సిరాజ్.. బుమ్రా ఆలింగనం) ఛేదిస్తే రికార్డేగబ్బా స్టేడియంలో ఆస్ట్రేలియాకు గొప్ప రికార్డు ఉంది. ఆ స్డేడియంలో ఆసీస్ 55 టెస్టులు ఆడగా.. 33 మ్యాచుల్లో విజయం సాధించింది. 13 టెస్టులను డ్రా చేసుకుంది. 8 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇక 1988లో వెస్టిండీస్‌తో పరాజయం తర్వాత ఇప్పటివరకు అక్కడ ఒక్క టెస్టులో కూడా ఆసీస్ ఓడిపోలేదు. మరోవైపు గబ్బాలో ఇప్పటివరకు అత్యధిక ఛేజింగ్ స్కోరు 236 కావడం గమనార్హం. 1951/52 లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో ఆతిథ్య ఆసీస్ 236 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. అనంతరం 1975/76 లో మళ్లీ వెస్టండీస్ పైన ఆస్ట్రేలియా 219 టార్గెట్ ఛేదించింది.1982/83 లో ఇంగ్లండ్‌పై ఆసీస్ 188 పరుగుల్ని ఛేదించింది. 1978/79లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇంగ్లండ్ ఆస్ట్రేలియాపై గెలుపొందింది. 2017/18లో ఆసీస్ 170 పరగుల టార్గెట్ ఛేదించి ఇంగ్లండ్‌పై గెలిచింది. ఈ రికార్డులను పరిశీలిస్తే భారత్ భారీగా పరుగులు సాధించడం కష్టంగానే కనిపిస్తోంది. సిడ్నీ టెస్టు మాదిరిగా డ్రాగా దిశగా సాగినా ఈ పరిస్థితుల్లో భారత్‌కు అది విజయంతో సమానం!! (చదవండి: ఆసీస్ ఆలౌట్, భారత్‌కు భారీ టార్గెట్) -
భారీ షాట్ ఆడబోయి బ్యాట్‌ను వదిలేశాడుగా
-
షాట్ ఆడబోయి బ్యాట్‌ను వదిలేశాడుగా
బ్రిస్బేన్ : క్రికెట్ ఆటలో ఫన్నీ మూమెంట్స్ చోటు చేసుకువడం సహజంగా కనిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో గురువారం బ్రిస్బేన్ హీట్ , హోబర్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో భాగంగా 18వ ఓవర్లో ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ ఖైస్ అహ్మద్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్ హీట్ బౌలర్ జోష్ లాలోర్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరినీ స్టంప్స్‌కు దూరంగా జరిగి ఫైన్‌లెగ్ మీదుగా షాట్ ఆడాలని ప్రయత్నించి పొరపాటున బ్యాట్‌ను వదిలేశాడు. దీంతో బ్యాట్ గాల్లో గిర్రున తిరిగి కొంచెం దూరంలో పడింది. అయితే బ్యాట్‌ను తీసుకొచ్చిన ఆటగాడు ఖైస్కు ఇస్తూ' గబ్బాలో బాల్‌కు బదులు బ్యాట్లు ఎగురుతున్నాయి' అంటూ నవ్వుతూ చెప్పాడు. దీంతో ఖైస్‌తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా చిరునవ్వులు చిందించారు. కాగా ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ హోబర్ట్ హరికేన్స్‌పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవరల్లో 9వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆ తర్వాత 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బెన్ హీట్ 18.2 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. (ఇట్స్ మిరాకిల్.. ఒకే రోజు రెండు) -
బ్రిస్బేన్ (గబ్బా)
స్టేడియాలు చూసొద్దాం బ్రిస్బేన్ నగరంలోని శివారు ప్రాంతమైన ఉలెన్గబ్బాలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. ఆసీస్ స్పోర్ట్స్‌కు ఇది ఐకాన్. మొదట్లో దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఈ మైదానాన్ని 1993 నుంచి 2005 వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ గుండ్రంగా తీర్చిదిద్దారు. కాంక్రీట్ స్టాండ్లు, పచ్చిక బయళ్లు ఏర్పాటు చేశారు. దీంతో అధునాతన హంగులతో ఉన్న ఈ స్టేడియం అటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకూ మంచి ఆటవిడుపు ప్రదేశంగా మారింది. లెగ్ స్పిన్నర్లకు విశేషంగా సహకరించే ఈ వికెట్లపై ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టడం చాలా సులువు. దీని సామర్థ్యం 42 వేలు. క్వీన్స్లాండ్ రాజధాని అయిన బ్రిస్బేన్‌లో ఉపఖండపు వాతావరణ పరిస్థితులే ఉంటాయి. ఏడాదిలో చాలా వరకు ఎండ వేడిమి ఉంటుంది. సంవత్సరానికి దాదాపు 75 మిలియన్ల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోతుంటారు. అవుట్డోర్ లైఫ్ స్టయిల్, అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్స్, షాపింగ్, కల్చరల్ షోస్, ఎగ్జిబిషన్లు, డైనింగ్ సీన్స్ (రకరకాల ఆహారపదార్థాలు) ఎక్కువగా కనబడుతుంటాయి. సుందరమైన బీచ్‌లు, అద్భుతమైన ద్రాక్ష తోటలు, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలకు నిలయంగా ఉంది. క్వీన్స్‌లాండ్‌లో క్రూయిజ్‌ల సంచారం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన గోల్డ్‌కోస్ట్ థీమ్ పార్క్ ఇక్కడే ఉంది. మ్యాచ్‌లు: ఈ స్టేడియంలో మూడు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కటి కూడా పెద్ద మ్యాచ్ లేదు.