బ్రిస్బేన్ (గబ్బా)
స్టేడియాలు చూసొద్దాం
బ్రిస్బేన్ నగరంలోని శివారు ప్రాంతమైన ఉలెన్‌గబ్బాలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. ఆసీస్ స్పోర్ట్స్‌కు ఇది ఐకాన్. మొదట్లో దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఈ మైదానాన్ని 1993 నుంచి 2005 వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ గుండ్రంగా తీర్చిదిద్దారు. కాంక్రీట్ స్టాండ్‌లు, పచ్చిక బయళ్లు ఏర్పాటు చేశారు. దీంతో అధునాతన హంగులతో ఉన్న ఈ స్టేడియం అటు ఆటగాళ్లకు, ఇటు అభిమానులకూ మంచి ఆటవిడుపు ప్రదేశంగా మారింది. లెగ్ స్పిన్నర్లకు విశేషంగా సహకరించే ఈ వికెట్లపై ఎక్స్‌ట్రా బౌన్స్ రాబట్టడం చాలా సులువు. దీని సామర్థ్యం 42 వేలు. క్వీన్స్‌లాండ్ రాజధాని అయిన బ్రిస్బేన్‌లో ఉపఖండపు వాతావరణ పరిస్థితులే ఉంటాయి. ఏడాదిలో చాలా వరకు ఎండ వేడిమి ఉంటుంది.
సంవత్సరానికి దాదాపు 75 మిలియన్ల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోతుంటారు. అవుట్‌డోర్ లైఫ్ స్టయిల్, అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్స్, షాపింగ్, కల్చరల్ షోస్, ఎగ్జిబిషన్లు, డైనింగ్ సీన్స్ (రకరకాల ఆహారపదార్థాలు) ఎక్కువగా కనబడుతుంటాయి. సుందరమైన బీచ్‌లు, అద్భుతమైన ద్రాక్ష తోటలు, వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాలకు నిలయంగా ఉంది. క్వీన్స్‌లాండ్‌లో క్రూయిజ్‌ల సంచారం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఇష్టమైన గోల్డ్‌కోస్ట్ థీమ్ పార్క్ ఇక్కడే ఉంది.
మ్యాచ్‌లు: ఈ స్టేడియంలో మూడు లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కటి కూడా పెద్ద మ్యాచ్ లేదు.