బెనోని (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ కూడా తొలి సెమీస్‌లాగే ఉత్కంఠభరితంగా ముగిసింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఒక వికెట్ తేడా తో పాకిస్తాన్‌పై నెగ్గి ఈ టోర్నీ చరిత్రలో ఆరోసారి ఫైనల్‌కు చేరుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది.
అరాఫత్ (52; 9 ఫోర్లు), అజాన్ (52; 3 ఫోర్లు) అర్ధసెంచరీలు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ స్ట్రాకర్ (6/24) పాక్‌ను దెబ్బ తీశాడు. అనంతరం ఆస్ట్రేలియా 49.1 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి గెలిచింది. డిక్సన్ (50; 5 ఫోర్లు), ఒలీవర్ పీక్ (49; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
9వ వికెట్ కోల్పోయిన తర్వాత ఆసీస్ చివరి 4 ఓవర్లలో విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. తొలి 3 ఓవర్లలో 13 పరుగులు వచ్చాయి. స్లో ఓవర్ రేట్ కారణంగా పెనాల్టీ విధించడంతో ఆఖరి ఓవర్ కోసం ఫైన్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్‌ను పాక్ రింగ్ లోపలికి తీసుకు రావాల్సి వచ్చింది.
జీషాన్ వేసిన బంతిని బ్యాటర్ మెక్‌మిలన్ ఆడగా బంతి బ్యాట్ అంచుకు తాకి అదే ఫైన్ లెగ్ వైపు నుంచే బౌండరీ దాటింది. దాంతో ఆసీస్ కుర్రాళ్లు సంబరాలు చేసుకోగా, పాక్ బృందం నిరాశలో మునిగింది. ఆదివారం జరిగే తుది పోరులో భారత్‌తో ఆ్రస్టేలియా తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment