ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం త్రిపురాన విజయ్
రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు
కేఎల్ రాహుల్ క్లాసిక్ షాట్లను దగ్గరుండి చూడొచ్చు. మిచెల్ స్టార్క్ బులెట్ యార్కర్ల గుట్టు తెలుసుకోవచ్చు. హ్యారీ బ్రూక్ పరుగుల దాహం వెనుక రహస్యం తెలుసుకోవచ్చు. ఫాఫ్ డూప్లెసిస్ అనుభవాలను తెలుసుకుని పునాదులు పటిష్టం చేసుకోవచ్చు.
జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్‌కు బంగారం లాంటి అవకాశం తలుపు తట్టింది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి అడుగుపెట్టబోతున్న విజయ్‌కు అనుభవజు్ఞల ఆటతీరు మార్గదర్శకం కాబోతోంది. టీమిండియాలోకి ప్రవేశించేందుకు ఇది తొలి అడుగు కానుంది.
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్‌లో అడుగుపెట్టబోతున్నాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో రిజిస్టర్ చేసుకున్న విజయ్‌ను ఢిల్లీ డేర్ క్యాపిటల్స్ జట్టు అదే ధరకు కొనుగోలు చేసింది. సౌదీ అరేబియాలో ఈ ఐపీఎల్ వేలం జరిగింది. వేలంలో డీసీ జట్టు కొనుగోలు చేసిందని తెలిశాక క్రికెట్ తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు.
మూడేళ్లుగా నిలకడగా రాణింపు..
విజయ్ పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా.. గత మూడే ళ్లుగా నిలకడ చూపిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలెక్షన్స్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. కుచ్‌బిహార్ ట్రోఫీ, విజయ్‌హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోరీ్నలు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్ ఎంపిక కచ్చితంగా జరుగుతుందని తల్లిదండ్రులతోపాటు జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు ఆశించారు. వారి ఆశలు నిజమయ్యాయి.
శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక క్రికెటర్ ఐపీఎల్‌కు చేరువ కావడం గర్వంగా ఉందని జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లను తయారుచేస్తామని వారు చెబుతున్నారు.
జిల్లా నుంచి ఒకే ఒక్కడు..
జిల్లా నుంచి ఐపీఎల్ వరకు వెళ్లిన మొదటి క్రికెటర్‌గా త్రిపురాన విజయ్ గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పాఠశాల దశలో క్రికెట్‌పైన మక్కువతో త్రిపురాన విజయ్ 2013–14లో అరంగ్రేటం చేశాడు. అంతర్ జిల్లాల నార్త్‌జోన్ అండర్–14 జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రదర్శనతో రాణించడంతో కడప క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటింగ్‌తోపాటు ఆఫ్‌స్పిన్ మ్యాజిక్‌తో విశేషంగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు.
ట్రాక్ రికార్డ్
2022–23, 2024–25 రెండు సీజన్లలో ప్రతిష్టాత్మక రంజీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రా పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు.
అండర్–19 విభాగంలో ఏసీఏ నార్త్‌జోన్ పోటీల్లో 6 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీయడంతోపాటు 265 పరుగులు సాధించి ఉత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.అంతర్ రాష్ట్ర అండర్–25 వన్డే క్రికెట్ టో రీ్నలో హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో 4.4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లను ఆకర్షించాడు.
2021–22లో అంతర్రాష్ట్ర అండర్–23 క్రికెట్ టోరీ్నలో మెరుగ్గా రాణించడంతో బీసీసీఐ నిర్వహిస్తున్న బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికై శిక్షణ పొందారు.
ఆంధ్ర ప్రీమియం లీగ్(ఏపీఎల్) టీ–20 క్రికెట్ పోటీల్లో మూడు సీజన్లలోనూ రాణించా డు. రాయలసీమ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 63 పరుగులు సాధించి అజేయంగా నిలిచి విశేషంగా ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లోను సత్తాచాచడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు.
ఏపీఎల్ టీ–20 క్రికెట్ మ్యాచ్‌ల్లో బెస్ట్ ఫీల్డర్‌గా మరో రూ.50వేల నగదు బహుమతిని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చేతులమీదుగా అందుకున్నాడు.
గత సీజన్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన విదర్భపై తన మొదటి మ్యాచ్‌లోనే నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.
చాలా సంతోషంగా ఉంది
మా కుమారుడు విజయ్ ఐపీఎల్‌కు ఎంపిక కావడం నిజంగా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులుగా మేము గర్వపడుతున్నాం. ఐపీఎల్‌లో మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తే తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా క్రికెట్టే శ్వాసగా ఉంటున్నాడు. భగవంతుడు శ్రమకు తగిన ఫలితాన్ని అందించాడని నమ్ముతున్నాం.
–వెంకట కృష్ణంరాజు, లావణ్య త్రిపురాన విజయ్ తల్లిదండ్రులు
చాలా గర్వంగా ఉంది..
చాలా గర్వంగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఐపీఎల్‌కు ఎంపిక కావాలన్న నా కల సాకారమైంది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ సెలక్షన్ ట్రయల్స్ పాల్గొన్నప్పుడే నమ్మకం కలిగింది. నా బేస్ ప్రైస్ రూ.30లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, ప్రతినిధులకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. అవకాశం లభించిన మ్యాచుల్లో సత్తా చాటేందుకు ప్రయతి్నస్తాను. ఈ నాలుగు నెలలపాటు కఠోర సాధన చేస్తాను. నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులకు, జిల్లా క్రికెట్ సంఘం, ఆంధ్రా క్రికెట్ సంఘ పెద్దలకు కృతజ్ఞతలు.
త్రిపురాన విజయ్
Comments
Please login to add a commentAdd a comment