వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో పసికూన యూఏఈపై ప్రతాపం చూపించింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విండీస్.. నిన్న (జూన్ 6) జరిగిన రెండో వన్డేలో 78 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ టీమ్.. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (70 బంతుల్లో 64; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), జాన్సన్ చార్లెస్ (47 బంతుల్లో 63; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), చివర్లో ఓడియన్ స్మిత్ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 49.5 ఓవర్లలో 306 పరుగులకు ఆలౌటైంది. యూఏఈ బౌలర్లలో జహూర్ ఖాన్ 3.. అఫ్జల్ ఖాన్, సంచిత్ శర్మ, అలీ నసీర్ తలో 2 వికెట్లు, ఆదిత్య షెట్టి ఓ వికెట్ పడగొట్టారు.
307 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన యూఏఈ.. 95 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో బాసిల్ అహ్మద్ (49), అలీ నసీర్ (57), అయాన్ అఫ్జల్ ఖాన్ (25 నాటౌట్) ఆదుకునేందుకు విఫలయత్నం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యూఏఈ.. ఓవర్లు మొత్తం ఆడి 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విండీస్ బౌలర్లలో హాడ్జ్, రోస్టన్ ఛేజ్ తలో 2 వికెట్లు.. అకీమ్ జోర్డన్, ఓడియన్ స్మిత్, యాన్నిక్ కారియా తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య జూన్ 9న నామమాత్రపు మూడో వన్డే జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment