Umesh Yadav Cheated For Rs 44 Lakhs by His Friend Turned Manager - Sakshi
Sakshi News home page

Umesh Yadav: భారత క్రికెటర్‌కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు

Published Sun, Jan 22 2023 8:10 AM | Last Updated on Sun, Jan 22 2023 10:00 AM

Umesh Yadav Cheated For Rs 44 Lakhs By His Friend Turned Manager - Sakshi

టీమిండియా వెటరన్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్నేహితుడని నమ్మి పని ఇస్తే నట్టేట ముంచాడు. ఫ్లాట్‌ కొనుగోలు పేరిట ఉమేశ్‌ యాదవ్‌ను బురిడీ కొట్టించి రూ. 44 లక్షలు ఎగనామం పెట్టాడు. విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని కోరాడి పట్టణానికి చెందిన శైలేష్ ఠాక్రే (37)తో ఉమేశ్ యాదవ్‌కు ఎంతోకాలంగా స్నేహం ఉంది. 

శైలేష్ కు ఉద్యోగం లేపోవడంతో ఉమేశ్ తన మేనేజర్ గా జూలై 2014లో నియమించుకున్నాడు.ఎంతో నమ్మకంగా ఉండటంతో శైలేష్ కు ఆర్థిక వ్యవహారాలు కూడా అప్పగించాడు. ఉమేశ్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు. ఈ క్రమంలో రూ.44లక్షలకే భూమి ఇప్పిస్తానని ఉమేశ్ ను నమ్మించి ఆ ఫ్లాట్ ను తన పేరిట రిజిస్ట్రర్ చేసుకున్నాడు. 

ఈ విషయం తెలుసుకుని క్రికెటర్ ఉమేశ్ యాదవ్ నివ్వెరపోయాడు. నమ్మిన స్నేహితుడే తనను మోసం చేశాడని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. తన డబ్బు తిరిగి  ఇవ్వాలని శైలేష్‌ను కోరాడు. అయితే డబ్బు ఇవ్వడానికి శైలేష్ నిరాకరించడంతో ఉమేశ్ యాదవ్ పోలీసులను ఆశ్రయించాడు.ఉమేశ్ యాదవ్ ఫిర్యాదుతో పోలీసుల రంగంలోకి దిగారు. ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ఇక 2011లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఉమేశ్‌ యాదవ్‌ కొంతకాలంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. 12 ఏళ్ల కెరీర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ 54 టెస్టుల్లో 165 వికెట్లు, 75 వన్డేల్లో 106 వికెట్లు, 9 టి20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: 'భారీ స్కోర్లు రావడం లేవని తెలుసు.. కచ్చితంగా సెంచరీ కొడతా'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement