టీ20ల్లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ.. గేల్‌, పంత్‌ రికార్డులు బద్దలు | Urvil Patel Hits 2nd Fastest T20 Hundred Of All Time, Breaks Chris Gayle And Rishabh Pant Record | Sakshi
Sakshi News home page

టీ20ల్లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ.. గేల్‌, పంత్‌ రికార్డులు బద్దలు

Published Wed, Nov 27 2024 12:50 PM | Last Updated on Wed, Nov 27 2024 1:00 PM

Urvil Patel Hits 2nd Fastest T20 Hundred Of All Time, Breaks Chris Gayle And Rishabh Pant Record

టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదైంది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో గుజరాత్‌ ఆటగాడు ఉర్విల్‌ పటేల్‌.. 28 బంతుల్లోనే (త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో) శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్‌ చరిత్రలోనే ఇది సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ కాగా.. భారత్‌ తరఫున పొట్టి ఫార్మాట్‌లో ఇది ఫాస్టెస్ట్‌ సెంచరీగా రికార్డైంది.

గేల్‌, పంత్‌ రికార్డులు బద్దలు
టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీని చేరుకునే క్రమంలో ఉర్విల్‌.. క్రిస్‌ గేల్‌, రిషబ్‌ పంత్‌ల రికార్డులను బద్దలు కొట్టాడు. టీ20ల్లో గేల్‌ 30 బంతుల్లో శతక్కొట్టగా.. పంత్‌ 32 బంతుల్లో సెంచరీ బాదాడు.

సాహిల్‌ చౌహాన్‌ పేరిట ఫాస్టెస్ట్‌ సెంచరీ
పొట్టి ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్‌ చౌహాన్‌ పేరిట ఉంది. చౌహాన్‌ ఈ ఏడాదే సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 బంతుల్లో శతక్కొట్టాడు. ఉర్విల్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును కేవలం ఒక్క బంతితో మిస్‌ అయ్యాడు.

భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ
టీ20ల్లో భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు రిషబ్‌ పేరిట ఉండగా.. తాజాగా ఉర్విల్‌ పంత్‌ రికార్డును బద్దలు కొట్టాడు. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతులు ఎదుర్కొన్న ఉర్విల్‌ 7 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ ఫాస్టెస్ట్‌ సెంచరీ
భారత్‌ తరఫున లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు ఉర్విల్‌ పేరిటే ఉంది. 2023 నవంబర్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్‌ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్‌ పఠాన్‌ పేరిట ఉంది. 2010లో మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో యూసఫ్‌ పఠాన్‌ 40 బంతుల్లో సెంచరీ బాదాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. శ్రీదమ్‌ పాల్‌ (57) అర్ద సెంచరీతో రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో నగస్వల్లా అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలోకి దిగిన గుజరాత్‌ 10.2 ఓవర్లలోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. ఉర్విల్‌ సునామీ శతకంతో విరుచుకుపడగా.. ఆర్య దేశాయ్‌ (38) మరో ఎండ్‌ నుంచి ఉర్విల్‌కు సహకరించాడు.

ఎవరీ ఉర్విల్‌ పటేల్‌..?
26 ఏళ్ల ఉర్విల్‌ బరోడాలోని మెహసానాలో జన్మించాడు. 2018లో అతను బరోడా తరఫున టీ20 అరంగేట్రం చేశాడు. అదే ఏడాది అతను లిస్ట్‌-ఏ క్రికెట్‌లోకి కూడా అడుగుపెట్టాడు. అయితే ఆతర్వాత ఉర్విల్‌కు ఫస్ట్‌ క్లాస్‌ అరంగేట్రం చేసేందుకు ఆరేళ్లు పట్టింది. ఉర్విల్‌ గతేడాదే రంజీల్లోకి అడుగుపెట్టాడు.

గుజరాత్‌ టైటాన్స్‌ వదిలేసింది..!
ఉర్విల్‌ను 2023 ఐపీఎల్‌ సీజన్‌ వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ 20 లక్షల బేస్‌ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఆ సీజన్‌లో ఉర్విల్‌కు ఒక్క మ్యాచ్‌ ఆడే అవకాశం కూడా రాలేదు.  ఉర్విల్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ 2025 మెగా వేలానికి ముందు వదిలేసింది. రెండు రోజుల కిందట జరిగిన మెగా వేలంలో ఉర్విల్‌ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఉర్విల్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. తాజా ఇన్నింగ్స్‌ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మనసు మార్చుకుంటాయేమో వేచి చూడాలి.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement