US Open: వరల్డ్‌ నంబర్‌ 1కు ఊహించని షాక్‌.. టోర్నీ నుంచి అవుట్‌ | US Open 2023 World No 1 Iga Swiatek Crashes Out Of Grand Slam Tourney | Sakshi
Sakshi News home page

Iga Swiatek: వరల్డ్‌ నంబర్‌ 1కు ఊహించని షాక్‌.. టోర్నీ నుంచి అవుట్‌

Published Mon, Sep 4 2023 12:45 PM | Last Updated on Mon, Sep 4 2023 1:09 PM

 US Open 2023 World No 1 Iga Swiatek Crashes Out Of Grand Slam Tourney - Sakshi

న్యూయార్క్‌: పోలండ్‌ టెన్నిస్‌ స్టార్‌, వరల్డ్‌ నెంబర్‌ 1 ఇగా స్వియాటెక్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ప్రతిష్టాత్మక యూఎస్‌ ఓపెన్‌-2023 టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. టాప్‌-20 సీడ్‌ జెలెనా ఒస్తాపెంకో చేతిలో ఓటమి పాలై ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్‌ రౌండ్‌ 16లో డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వియాటెక్‌ను 6-3, 3-6, 1-6తో ఓడించిన జెలెనా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ముందడుగు వేసింది.

పూర్తిగా తనదే ఆధిపత్యం
కాగా నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన పోరులో స్వియాటెక్‌ 6-3తో తొలి సెట్‌ గెలిచినప్పటికీ.. ఆ తర్వాత జెలెనా పూర్తిగా ఆధిపత్యం కొనసాగించింది. తగ్గేదేలే అన్నట్లు టాప్‌ సీడ్‌కు షాకుల మీద షాకులిచ్చి 3-6, 1-6తో ఏ దశలోనూ కోలుకోకుండా చేసింది. తద్వారా స్వియాటెక్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

క్వార్టర్‌ ఫైనల్లో ఆమెతో పోటీ
ఇక జెలెనా చేతిలో పరాజయం పాలైన స్వియాటెక్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయింది. పోలండ్‌ స్టార్‌ తాజా ఓటమి నేపథ్యంలో రెండో సీడ్‌గా ఉన్న బెలారస్‌ టెన్నిస్‌ తార అరియానా సబలెంక నంబర్‌ 1గా అవతరించింది. ఇదిలా ఉంటే.. యూఎస్‌కు చెందిన కోకో గాఫ్‌.. మాజీ వరల్డ్‌ నంబర్‌ 1 కరోలిన్‌ వోజ్నియాకిపై గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో జెలెనా క్వార్టర్స్‌లో కోకో గాఫ్‌ను ఎదుర్కోనుంది.

క్వార్టర్స్‌లో ముకోవా 
యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో పదో సీడ్‌ కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) తొలిసారి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 10వ ర్యాంకర్‌ ముకోవా 2 గంటల 34 నిమిషాల్లో 6–3, 5–7, 6–1తో జిన్‌యు వాంగ్‌ (చైనా)పై గెలిచింది. ఈ క్రమంలో తదుపరి గేమ్‌లో ముకోవా సొరానాతో తలపడనుంది.

చదవండి: నేపాల్‌తో మ్యాచ్‌కూ వర్షం గండం.. రద్దయితే టీమిండియా పరిస్థితేంటి..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement