ఉత్తరాఖండ్ రంజీ క్రికెట్ అసోసియేషన్‌లో చోటుచేసుకుంటున్న అక్రమాల గురించి కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కోవిడ్-19 తర్వాత క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఉత్తరాఖండ్(సీఏయూ) తప్పుడు రిపోర్టులు అందిస్తూ వచ్చింది. తమ రంజీ ఆటగాళ్లకు రోజు దినసరి కూలి కింద రూ.వంద ఇవ్వడం సంచలనం రేపింది. సీఏయూ రిపోర్ట్ ప్రకారం రూ.1.74 కోట్లు కేవలం ఫుడ్, ఇతర క్యాటరింగ్ సేవలకు ఉపయోగించినట్లు పేర్కింది. కేవలం ఆటగాళ్లకు అందించే అరటిపండ్లకు రూ. 35 లక్షల దొంగ బిల్లులను చూపించింది. ఇక రూ.49.5 లక్షలు రోజూవారి అలెవన్స్‌ల కింద తప్పుడు లెక్కలు సమర్పించింది.
ఇలాంటి తప్పుడు బిల్లులకు తోడూ ఆటగాళ్లకు చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. తమ బిల్లులు చెల్లించాలని ఎవరైనా ఫోన్ చేస్తే చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని మాజీ అండర్-19 క్రికెటర్ ఆర్య సేతీ పేర్కొన్నాడు.ఈ విషయమై అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీఎయూ సెక్రటరీ మహిమ్ వర్మ, హెడ్‌కోచ్ మనీష్ జా, అసోసియేషన్ అధికార ప్రతినిధి సంజయ్ గుసెన్‌లను విచారించగా.. క్రికెటర్లకు బెదిరింపులు నిజమేనని పేర్కొన్నారు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
కాగా బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక రంజీ క్రికెటర్‌కు రోజువారీ వేతనంలో ఒక క్రికెటర్‌కు రూ. 1000-1500 నుంచి అందుకుంటారు. అదే ఒక సీనియర్ క్రికెటర్‌కు రూ. 2వేల వరకు పొందుతారు. కానీ ఈ నిబంధనలను గాలికొదిలేసిన ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ గత 12 నెలలుగా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా కేవలం వంద రూపాయాలను మాత్రమే రోజూవారీ వేతనంగా ఇస్తుండడం శోచనీయం.
గత మార్చి 20న 'టోర్నమెంట్ అండ్ ట్రయల్ క్యాంప్ ఎక్స్‌పెన్సెస్' పేరిట తయారు చేసిన ఆడిట్ రిపోర్టులో మాత్రం సదరు క్రికెట్ అసోసియేషన్ ఘనంగానే లెక్కలు చూపించింది. ఆటగాళ్ల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులతో కలిపి రూ.1,74,07,346 ఖర్చు చేస్తున్నట్లు చూపించింది. ఇందులో రూ.49,58,750లను ఆటగాళ్లకిస్తున్న రోజువారీ వేతనం కింద లెక్క చూపించింది. అంతేగాక మరో 35 లక్షలతో ఆటగాళ్లకు అరటిపండ్లు, రూ.22 లక్షలతో వాటర్ బాటిల్స్ అందిస్తున్నట్లుగా రిపోర్ట్‌లో చూపించింది.
Comments
Please login to add a commentAdd a comment