టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy)కి నిరాశే మిగిలింది. ప్రతిష్టాత్మక ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు తొలిసారిగా నామినేట్ అయిన అతడికి భంగపాటు తప్పలేదు. వరుణ్ మాదిరే ఇటీవల అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వెస్టిండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్(Jomel Warrican) అవార్డును ఎగురేసుకుపోయాడు.
ఇదొక చిన్న మైలురాయి
వరుణ్ చక్రవర్తి, పాకిస్తాన్ స్పిన్నర్ నొమన్ అలీ(Noman Ali)లను వెనక్కినెట్టి జనవరి నెలకు గానూ వారికన్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు గెలవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ ఏడాది టెస్టుల్లో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడమే నా లక్ష్యంగా ఉండేది. అయితే, ఇంత గొప్పగా దానిని సాధిస్తానని అనుకోలేదు.
నా క్రికెట్ ప్రయాణంలో ఇదొక చిన్న మైలురాయి. ఇలాంటివి మరెన్నో సాధించాలని కోరుకుంటున్నా. పాకిస్తాన్‌తో సిరీస్‌లో తప్పక రాణిస్తానని మా కెప్టెన్‌కు మాటిచ్చాను. మా నాన్న కళ్లెదుటే నా నుంచి ఇలాంటి గొప్ప ప్రదర్శన రావడం చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని వారికన్ హర్షం వ్యక్తం చేశాడు.
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో
కాగా ఇటీల పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జొమెల్ వారికన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పాక్ గడ్డపై రెండు టెస్టుల్లో కలిపి మొత్తంగా పందొమ్మిది వికెట్లు తీశాడు. ముల్తాన్ వేదికగా తొలి టెస్టు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన ఈ 32 ఏళ్ల స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు వికెట్లు కూల్చాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాటర్ల వైఫల్యం కారణంగా పాకిస్తాన్ చేతిలో 127 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక ముల్తాన్‌లోనే జరిగిన రెండో టెస్టులో వారికన్ వరుసగా నాలుగు, ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ పాకిస్తాన్‌ను 120 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో 2ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ సిరీస్’ అవార్డునూ వారికన్ సొంతం చేసుకున్నాడు.
వరుణ్ మాయాజాలం
మరోవైపు.. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 14 వికెట్లు కూల్చిన అతడి ఖాతాలో ఓ ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉండటం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచిన వరుణ్.. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. అయితే, వారికన్‌తో పోటీలో వెనుకబడి విజేతగా నిలవలేకపోయాడు.
విజేతగా బెత్ మూనీ
ఇక మహిళా క్రికెటర్ల విభాగంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ బెత్ మూనీ జనవరి నెలకు గానూ ‘’ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో భాగంగా తన టెస్టు కెరీర్‌లో తొలి శతకం బాదిన ఆమె.. అంతకు ముందు టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మూనీ ప్రదర్శనకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక అవార్డు వరించడం విశేషం.
వెస్టిండీస్ స్పిన్నర్ కరిష్మా రామ్‌హరాక్, అండర్-19 ప్రపంచకప్-2025లో అదరగొట్టిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ తెలుగమ్మాయి గొంగడి త్రిషలను వెనక్కి నెట్టి మూనీ అవార్డును సొంతం చేసుకుంది.
కాగా అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు అవార్డులు ఇచ్చే క్రమంలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెలా నామినేట్ అయిన ఆటగాళ్లకు వచ్చిన ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించి.. అవార్డును ప్రదానం చేస్తారు.
చదవండి: తప్పు చేస్తున్నావ్ గంభీర్.. అతడిని బలి చేయడం అన్యాయం: మాజీ క్రికెటర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment