బెంగళూరు: ‘‘ప్రియమైన.. అందమైన అమ్మ.. అక్క... మన పొదరింటిని నిలబెట్టింది మీరిద్దరే. ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. గత కొన్నిరోజులుగా మన ఇంట్లో జరుగుతున్న పరిణామాలు గుండెను బద్దలు చేస్తున్నాయి. అమ్మా... ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యవంతురాలిగా నన్ను పెంచావు. నాకు తెలిసిన అత్యంత అందమైన మనసు గల, నిస్వార్థమైన వ్యక్తివి నువ్వే. అక్కా.. నీకు అత్యంత ఇష్టమైన చెల్లిని నేనని నాకు తెలుసు. నువ్వొక యోధురాలివి. చివరి నిమిషం దాకా ఎలా పోరాడాలో నాకు నేర్పించావు.
మీరిద్దరూ.. నా ప్రతిమాటలో.. నేను చేసే ప్రతిపనిలో సంతోషం వెదుక్కునే వారు. మీకు తెలుసా.. నాకు ఇద్దరు అమ్మలు అనే గర్వం నాలో ఉండేది. కానీ.. ఏ మనిషికీ ఇంత గర్వం పనికిరాదు. గతకొన్ని రోజులుగా మీతో గడిపిన సంతోష క్షణాలే ఆఖరు అవుతాయని నేను ఊహించలేకపోయాను. మీరిద్దరు నన్ను వదిలేసి శాశ్వతంగా వెళ్లిపోయిన తర్వాత నా ప్రపంచమంతా తలకిందులైపోయింది. మీ ఇద్దరినీ నేనెంతగా ప్రేమిస్తానో అంతే మిస్సవుతున్నాను కూడా.. నాకింతటి ప్రేమను పంచినందుకు ధన్యవాదాలు’’ అంటూ భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిని, అక్కను గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు.
కాగా వేద కృష్ణమూర్తి తల్లి చెలువాంబా గత నెల 23న కరోనాతో మృతి చెందగా.. ఆమె అక్క వత్సల కోవిడ్‌తో మే 6న కన్నుమూశారు. వరుస ఘటనల నేపథ్యంలో ఆమె కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ క్రమంలో వేద కృష్ణమూర్తి అమ్మ, అక్కతో తనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా సోమవారం ట్విటర్ వేదికగా ఓ నోట్ షేర్ చేశారు.
ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఉద్వేగానికి లోనైన ఆమె.. ‘‘నాలాంటి బాధను అనుభవిస్తున్న వారిని తలచుకుంటుంటే మనస్సు తరుక్కుపోతోంది. నిజానికి మా కుటుంబం చాలా జాగ్రత్తలు పాటించింది. అయినా మహమ్మారి మా ఇంటి వరకు వచ్చిది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ప్రతిఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించండి. సురక్షితంగా, ధైర్యంగా ఉండండి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా బెంగళూరుకు చెందిన వేద కృష్ణమూర్తి భారత్ తరఫున 48 వన్డేలు ఆడి 829 పరుగులు... 76 టి20 మ్యాచ్‌లు ఆడి 875 పరుగులు సాధించారు.
To my dearest Amma and Akka ❤️ pic.twitter.com/NLj7kAYQXN
— Veda Krishnamurthy (@vedakmurthy08) May 10, 2021
Comments
Please login to add a commentAdd a comment