భూకంప విలయం.. కన్నపేగు కోసం ఫుట్‌బాలర్‌ భార్య ప్రాణత్యాగం | Venezuelan footballer Wife Demise Shielding Daughter In Earthquake | Sakshi
Sakshi News home page

భూకంప విలయం.. కన్నపేగు రక్షణ కోసం ఫుట్‌బాలర్‌ భార్య ప్రాణత్యాగం

Jun 28 2026 9:24 AM | Updated on Jun 28 2026 11:05 AM

Venezuelan footballer Wife Demise Shielding Daughter In Earthquake

వెనెజువెలాను అతలాకుతలం చేసిన జంట భూకంపాలు స్టార్ ఫుట్‌బాలర్ భార్యను బలి తీసుకుంది. ఏడాది వయసున్న కూతురును కాపాడుకునే క్రమంలో శిథిలాల కింద చిక్కుకొని ఆమె చనిపోయింది. అయితే తల్లిప్రేమను చాటుతూ తన ఒడిలో భద్రంగా దాచుకున్న కూతురు సురక్షితంగా  ప్రాణాలతో బయటపడింది. కన్నపేగును కాపాడుకునే క్రమంలో ప్రాణాలొదిలి మాతృప్రేమను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తన భార్య మరణం విషయాన్ని ఆమె భర్త విషణ్ణవదనంతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడం అందరి హృదయాలను కలిచివేసింది.

వెనెజువెలాకు చెందిన హెక్టర్ బెల్లో మార్టియో లా గ్వాయిర్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. అయితే జూన్ 24న సంభవించిన జంట భూకంపాల ధాటికి భారీ భవనాలు సైతం నేలకొరిగాయి. భూకంపం సంభవించిన సమయంలో హెక్టర్ బెల్లో భార్య ఆండ్రియా ఇంట్లోనే ఉంది. అయితే భూకంపం ధాటికి వాళ్లు నివసిస్తున్న భవనం క్షణాల్లోనే నేలమట్టమయింది. 

అంత పెద్ద ఉత్పాతంలోనూ ఏడాది వయసున్న తన కూతురు అలానాను కాపాడుకోవాలని ఆండ్రియా భావించింది. అందుకే వారిపై దూసుకొస్తున్న మృత్యు శకలాలను తన బిడ్డకు ఏ అపాయం చేయకుండా ఆమె శరీరాన్ని అడ్డుపెట్టింది. భవన శిథిలాలు ఆమె శరీరంపై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. కానీ తాను అనుకున్న ప్రకారమే కూతురును తన పొత్తిళ్లలో భద్రంగా దాచుకొని ఆమెను రక్షించుకుంది. 

సహాయక చర్యల్లో భాగంగా ఆండ్రియా శవాన్ని శిథిలాల కింద నుంచి తీస్తున్న క్రమంలో పాప ఏడుపు వినిపించింది. దీంతో ఆండ్రియా శవాన్ని బయటకు తీసి చూడగా ఆమె చేతుల్లో అలానా మృత్యుంజయురాలిగా ఉంది. దీంతో విషయాన్ని వెంటనే హెక్టర్‌కు చేరవేయడంతో ఆయన వచ్చి భార్య ఆండ్రియా మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. తమ కూతురును కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించిన భార్య ఆండ్రియాను గట్టిగా హత్తుకొని ఏడ్వడం అందరిని కలచివేసింది. 

‘అమ్మ చనిపోయిందన్న విషయం నా కూతురుకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నా భార్య ప్రాణాలకు తెగించి కాపాడిన నా బిడ్డను జాగ్రత్తగా పెంచుకుంటాను. తల్లి వీరత్వాన్ని ఆమెకు అర్థమయ్యేలా వివరిస్తాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా రాసుకొచ్చాడు. ఇక వెనెజువెలాలో సంభవించిన జంట భూకంపాల విషాదంలో మృతుల సంఖ్య 1500 దాటింది. కనీసం 70వేల మంది గల్లంతయినట్లు తెలిపిన ప్రభుత్వం సహాయక  చర్యలు సాగుతున్నట్లు పేర్కొంది.

చదవండి: ఓటమి ఎరుగని అర్జెంటీనా.. మెస్సీ మ‌రో రికార్డు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement