pic credit: English jagran
విధ్వంసకర బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, హెర్షల్ గిబ్స్, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్ మరోసారి విధ్వంసానికి రెడీ అంటున్నారు. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే వెటరన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో వీరు మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నారు.
తొలిసారి నిర్వహించబడుతున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 23న ప్రారంభమై మార్చి 3న ముగుస్తుంది. తొలుత ఈ టోర్నీని డెహ్రడూన్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే అనివార్య కారణాల వల్ల వేదికను గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు మారుస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు.
ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ టైగర్స్, రాజస్థాన్ లెజెండ్స్, రెడ్ కార్పెట్ ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ వారియర్స్, ముంబై ఛాంపియన్స్ జట్లు ఈ వెటరన్ లీగ్‌లో అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఫిబ్రవరి 23న జరుగునున్న తొలి మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ నేతృత్వంలోని ముంబై ఛాంపియన్స్.. క్రిస్ గేల్ సారథ్యంలోని తెలంగాణ టైగర్స్‌తో తలపడుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో డబుల్ హెడర్ మ్యాచ్‌లు కూడా జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ 2 గంటలకు, రాత్రి మ్యాచ్ ఏడు గంటలకు ప్రారంభమవుతాయి.
ఈ టీ20 లీగ్‌ను డీడీ స్పోర్ట్స్, యూరోస్పోర్ట్స్‌తో పాటు ఫ్యాన్‌కోడ్‌లో వీక్షించవచ్చు. ఈ మెగా ఈవెంట్‌లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్‌తో పాటు హెర్షల్ గిబ్స్, యూసఫ్ పఠాన్, సురేశ్ రైనా, మునాఫ్ పటేల్, రజత్ భాటియా, ప్రవీణ్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment