శ్రేయస్‌ అయ్యర్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. తిలక్‌ వర్మకు చేదు అనుభవం | VHT 2024: Shreyas Iyer 20 Ball 40 Mumbai Beat Hyderabad By 3 Wickets | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసం.. తిలక్‌ వర్మకు చేదు అనుభవం

Published Mon, Dec 23 2024 3:58 PM | Last Updated on Mon, Dec 23 2024 4:39 PM

VHT 2024: Shreyas Iyer 20 Ball 40 Mumbai Beat Hyderabad By 3 Wickets

విజయ్‌ హజారే ట్రోఫీ(VHT) 2024-25 సీజన్‌లో ముంబై జట్టు తొలి గెలుపు నమోదు చేసింది. అహ్మదాబాద్‌లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ VHTలో భాగంగా గ్రూప్‌-‘సి’లో ఉన్న  ముంబై తమ తొలి మ్యాచ్‌లో కర్ణాటకతో తలపడింది.

అయితే, ఈ లిస్ట్‌-‘ఏ’ మ్యాచ్‌లో ముంబై సారథి శ్రేయస్‌ అయ్యర్‌ విధ్వంసకర శతకం(55 బంతుల్లో 114 నాటౌట్‌) బాదినా ఫలితం లేకపోయింది. కర్ణాటక చేతిలో ఏడు వికెట్ల తేడాతో ముంబై పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ముంబై ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు.

టాస్‌ గెలిచిన ముంబై.. తిలక్‌ వర్మ డకౌట్‌
నరేంద్ర మోదీ స్టేడియం ‘బి’ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు.. ముంబై బౌలర్ల ధాటికి 169 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌(64), అభిరథ్‌ రెడ్డి(35) రాణించినా.. కెప్టెన్‌ తిలక్‌ వర్మ(0) మరోసారి విఫలమయ్యాడు.

ఇక మిడిలార్డర్‌లో అలెగాని వరుణ్‌ గౌడ్‌(1), రోహిత్‌ రాయుడు(1) పూర్తిగా నిరాశపరచగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అరవెల్లి అవినాశ్‌(52) అర్ధ శతకంతో సత్తా చాటాడు. 

మిగతా వాళ్లంతా సింగిల్‌ డిజిట్ స్కోర్లకే పెవిలియన్‌ చేరడంతో హైదరాబాద్‌ 38.1 ఓవర్లలోనే ఆలౌట్‌ అయింది. ముంబై బౌలర్లలో స్పిన్నర్‌ అథర్వ అంకోలేకర్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఆయుశ్‌ మాత్రే మూడు వికెట్లు పడగొట్టాడు.

105/7.. ఓటమి అంచుల్లో ఉన్న వేళ
అదే విధంగా తనుష్‌ కొటియాన్‌ రెండు, శార్దూల్‌ ఠాకూర్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు అంగ్‌క్రిష్‌ రఘువంశీ(19), ఆయుశ్‌ మాత్రే(28) నిరాశపరచగా.. హార్దిక్‌ తామోర్‌(0), సూర్యాంశ్‌ షెడ్గే(6), అథర్వ అంకోలేకర్‌(5), శార్దూల్‌ ఠాకూర్‌(0) పూర్తిగా విఫలమయ్యారు.

ఇక ఎనిమిదో స్థానంలో వచ్చిన టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(18) కూడా చేతులెత్తేశాడు. దీంతో ముంబై 105 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన వేళ తొమ్మిదో స్థానంలో బరిలోకి దిగిన శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

అయ్యర్‌ ధనాధన్‌.. తిలక్‌ సేనకు చేదు అనుభవం
మరో ఎండ్‌ నుంచి తనుష్‌ కొటియాన్‌(37 బంతుల్లో 39 నాటౌట్‌) సహకారం అందించగా.. అయ్యర్‌ ధనాధన్‌ దంచికొట్టాడు. కేవలం 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 220కి పైగా స్ట్రైక్‌రేటుతో 44 పరుగులతో దుమ్ములేపాడు. ఈ క్రమంలో 25.2 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసిన ముంబై.. తిలక్‌ సేనపై జయభేరి మోగించింది.

ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ముంబై ఆల్‌రౌండర్‌ తనుష్‌ కొటియాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. కాగా ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌తో గురువారం మ్యాచ్‌ ఆడనుంది. 

ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టైటిల్‌ను శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని ముంబై జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే.

చదవండి: PV Sindhu Marriage Photo: పీవీ సింధు పెళ్లి.. తొలి ఫొటో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement