తిలక్‌ వర్మ విఫలం.. హైదరాబాద్‌ను గెలిపించిన సీపీ తనయుడు | VHT 2024 Tilak Varma Fails CV Milind Shines Hyderabad Beat Puducherry | Sakshi
Sakshi News home page

తిలక్‌ వర్మ విఫలం.. హైదరాబాద్‌ను గెలిపించిన సీపీ తనయుడు

Published Sat, Dec 28 2024 4:59 PM | Last Updated on Sat, Dec 28 2024 6:38 PM

VHT 2024 Tilak Varma Fails CV Milind Shines Hyderabad Beat  Puducherry

విజయ్‌ హజారే ట్రోఫీ 2024-25(Vijay Hazare Trophy 2024-25) ఎడిషన్‌లో హైదరాబాద్‌ రెండో గెలుపు నమోదు చేసింది. పుదుచ్చేరితో శనివారం జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీవీ మిలింద్‌ అద్భుత బౌలింగ్‌తో హైదరాబాద్‌ను గెలిపించి.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.

కాగా డిసెంబరు 21 దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ ఆరంభం కాగా.. హైదరాబాద్‌ తొలుత నాగాలాండ్‌తో తలపడింది. ఆ మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో గెలుపొందింది. అనంతరం ముంబై చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓడిన తిలక్‌ సేన.. ఆ తర్వాత సౌరాష్ట్రతో మ్యాచ్‌లోనూ ఆరు వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.

ఆకాశమే హద్దుగా చెలరేగిన సీవీ మిలింద్‌
ఈ క్రమంలో అహ్మదాబాద్‌ వేదికగా శనివారం పుదుచ్చేరితో తలపడిన హైదరాబాద్‌.. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసింది. లెఫ్టార్మ్‌ పేసర్‌ సీవీ మిలింద్‌(CV Milind) ఆకాశమే హద్దుగా చెలరేగి.. పాండిచ్చేరి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 

టాపార్డర్‌లో ఓపెనర్లు గంగా శ్రీధర్‌ రాజు(2), అజయ్‌ రొహేరా(0)లతో పాటు.. మిడిలార్డర్‌లో ఫాబిద్‌ అహ్మద్‌(7).. అదే విధంగా లోయర్‌ ఆర్డర్‌లో అంకిత్‌ శర్మ(6), గౌరవ్‌ యాదవ్‌(13) రూపంలో ఐదు వికెట్లు(5/13) దక్కించుకున్నాడు.

సీవీ మిలింద్‌కు తోడుగా తనయ్‌ త్యాగరాజన్‌ మూడు వికెట్లతో రాణించగా.. ముదాసిర్‌, శరణు నిశాంత్‌ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ బౌలర్ల ధాటికి పుదుచ్చేరి 31.5 ఓవర్లలో 98 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి.

తిలక్‌ మరోసారి విఫలం.. రాణించిన హిమతేజ
ఓపెనర్లు తన్మయ్‌ అగర్వాల్‌(0), నితేశ్‌ రెడ్డి(5).. వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ తిలక్‌ వర్మ(6) పూర్తిగా విఫలమయ్యారు. అయితే, నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన కొడిమెల హిమతేజ 42 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. తనయ్‌ త్యాగరాజన్‌ 22 పరుగులతో అతడికి సహకారం అందించాడు. 

ఆఖర్లో వరుణ్‌ గౌడ్‌ 13(నాటౌట్‌) చేశాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి తిలక్‌ సేన 102 పరుగులు చేసి.. పుదుచ్చేరిపై విజయం సాధించింది.

సీపీ తనయుడు
కాగా సీవీ మిలింద్‌ మరెవరో కాదు.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ కుమారుడు. దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 30 ఏళ్ల ఈ పేస్‌ బౌలర్‌.. జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. ఇక సీవీ ఆనంద్‌ కూడా అండర్‌-19 స్థాయిలో క్రికెట్‌ ఆడారన్న విషయం తెలిసిందే.

తిలక్‌ వర్మ వరుస వైఫల్యాలు
ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ముందు విజయ్‌ హజారే ట్రోఫీ రూపంలో వచ్చిన అవకాశాన్ని టీమిండియా యువ సంచలనం తిలక్‌ వర్మ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. 

సారథిగానూ, బ్యాటర్‌గానూ అతడు విఫలమమవుతున్నాడు. ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన తిలక్‌ చేసిన పరుగులు 0,  0, 57, 6. సారథిగానూ చిన్న జట్లపై గెలిపించాడే తప్ప.. పెద్ద జట్లపై విజయం అందించలేకపోతున్నాడు.

చదవండి: Nitish Reddy: కొడుకంటే ఇలా ఉండాలి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement