విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ పట్టపగ్గాల్లేకుండా విరుచుకుపడుతున్నాడు. ఈ టోర్నీలో కరుణ్ ఇప్పటివరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో రికార్డు స్థాయిలో 752 సగటున 752 పరుగులు (112*, 44*, 163*, 111*, 112, 122*, 88*) చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఓ అర్ద సెంచరీ ఉన్నాయి. ఈ ఏడు ఇన్నింగ్స్‌ల్లో కరుణ్ కేవలం ఒక్క సారి మాత్రమే ఔటయ్యాడు.
పేట్రేగిపోయిన కరుణ్
మహారాష్ట్రతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో కరుణ్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కరుణ్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 380 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో విదర్భకు ఇదే అత్యధిక స్కోర్.
ఓపెనర్ల శతకాలు
ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర టాస్ గెలిచి విదర్భను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మహారాష్ట్ర ప్రత్యర్దిని బ్యాటింగ్ ఆహ్వానించి ఎంత తప్పు చేసిందో కొద్ది సేపటికే గ్రహించింది. విదర్భ ఓపెనర్లు మహారాష్ట్ర బౌలర్లను నింపాదిగా ఎదుర్కొంటూ సెంచరీలు చేశారు. దృవ్ షోరే 120 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 114 పరుగులు.. యశ్ రాథోడ్ 101 బంతుల్లో 14 ఫోర్లు, సిక్సర్ సాయంతో 116 పరుగులు చేశారు. దృవ్, యశ్ తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగులు జోడించారు. యశ్ ఔటైన తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ఆదిలో నిదానంగా బ్యాటింగ్ చేశాడు.
45 ఓవర్ తర్వాత కరుణ్.. జితేశ్ శర్మతో కలిసి గేర్ మార్చాడు. వీరిద్దరూ చివరి ఆరు ఓవర్లలో ఏకంగా 97 పరుగులు పిండుకున్నారు. జితేశ్ శర్మ (33 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఔటయ్యాక కరుణ్ మహోగ్రరూపం దాల్చాడు. తానెదుర్కొన్న చివరి 9 బంతుల్లో కరుణ్ 4 సిక్సర్లు, 3 బౌండరీలు బాదాడు. అంతకుముందు కరుణ్ 47వ ఓవర్‌లోనూ చెలరేగి ఆడాడు. ముకేశ్ చౌదరీ వేసిన ఈ ఓవర్‌లో కరుణ్ మూడు బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టాడు.
మొత్తానికి విదర్భ బ్యాటర్ల ధాటికి మహారాష్ట్ర బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముకేశ్ చౌదరీ 9 ఓవర్లు వేసి ఏకంగా 80 పరుగులు సమర్పించుకుని రెండు వికెట్లు పడగొట్టాడు. సత్యజిత్ 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి వికెట్ తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment