దక్షిణాఫ్రికాతో టీమిండియా మూడో వన్డే సందర్భంగా విరాట్ కోహ్లి గారాల పట్టి వామికా కెమెరా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. కోహ్లి సతీమణి అనుష్క శర్మ చేతుల్లో కేరింతలు కొడుతున్న చిన్నారి స్క్రీన్‌పై కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎట్టకేలకు వామిక పాపను చూశామంటూ కొందరు సంబరపడిపోగా.... బ్రాడ్‌కాస్టర్ ఇలా చేయడమేమిటని మరికొందరు మండిపడ్డారు.
విరుష్క కోరినట్లుగా వామిక విషయంలో గోప్యతకు భంగం కలిగించకుండా ఉండాల్సిందని.. ఇలా చేయడం సరికాదని ట్రోల్ చేశారు. ఈ క్రమంలో చాలా మంది ఫొటోలను డిలీట్ చేయగా... కొన్ని వార్తా సంస్థలు సైతం తమ ఆర్టికల్స్‌లో వామిక ఫొటో కనబడకుండా జాగ్రత్తపడ్డాయి. ఇక ఈ విషయంపై విరాట్ కోహ్లి తాజాగా స్పందించాడు. వామిక ఫొటోలు బయటకు వచ్చిన విషయం తమకు తెలియదని.. ఏదేమైనా వాటిని షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు.. ‘‘నిన్న మైదానంలో మా కుమార్తె ఫొటోలు తీసిన విషయం తెలిసింది.
నిజానికి కెమెరా మా మీద ఉందని తెలియదు. ఒకవేళ వామిక ఫొటోలు షేర్ చేయనట్లయితే మీ అందరికీ కృతజ్ఞతలు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం’’ అని అనుష్కతో కలిసి కోహ్లి ప్రకటన విడుదల చేశాడు. కాగా మూడో వన్డేలో కోహ్లి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనుష్క- వామిక నవ్వులు చిందిస్తూ కెమెరాకు చిక్కారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఆఖరి వరకు పోరాడిన టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి పాలై వైట్‌వాష్‌కు గురైంది.
చదవండి: Ind Vs Sa 3rd ODI: రాహుల్ చక్కగా కెప్టెన్సీ చేశాడు.. ఇదో కనువిప్పు: ద్రవిడ్
Comments
Please login to add a commentAdd a comment