దుబాయ్: విరాట్ కోహ్లి (61 బంతుల్లో 122 నాటౌట్; 12 ఫోర్లు, 6 సిక్సర్లు) అంతర్జాతీయ టి20 కెరీర్‌లో తొలి శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఆసియా కప్‌ను భారత్ విజయంతో ముగించింది. ‘సూపర్–4’లోని తమ ఆఖరి పోరులో భారత్ 101 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. మొదట భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. టోర్నీలో ఇదే అత్యధికస్కోరు. రాహుల్ (41 బంతుల్లో 62; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. మరో వైపు మ్యాచ్‌లోనే కాదు... ఈ టోర్నీకే హైలైట్ ఇన్నింగ్స్‌ను కోహ్లి ఆవిష్కరించాడు. 11వ ఓవర్లో 32 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫిఫ్టీ కొట్టిన కోహ్లి... మరో యాభై పరుగులకు 21 బంతులే సరిపోయాయి.
19వ ఓవర్ తొలి రెండు బంతుల్ని 4, 6గా బాదేసిన విరాట్ కేవలం 53 బంతుల్లో (11 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకాన్ని అందుకున్నాడు. 16 ఓవర్లు పూర్తయినప్పడు కూడా కోహ్లి స్కోరు 68 పరుగులే. శతకం చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ఫరీద్ వేసిన 17వ ఓవర్లో 2 బౌండరీలు బాదిన విరాట్ తర్వాత ఫారుఖి బౌలింగ్‌లోను 2 ఫోర్లు కొట్టాడు. ఈ ధాటికి నైన్టీస్‌లోకి వచ్చిన కోహ్లి... ఫరీద్ 19వ ఓవర్ రెండు బంతులు వేయగానే సెంచరీ పూర్తయ్యింది. ఫారుఖి వేసిన ఆఖరి ఓవర్లో కోహ్లి 6, 6, 4 కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. తర్వాత కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 111 పరుగులే చేసింది. భువనేశ్వర్ (4–1–4–5) పేస్‌కు 9 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన అఫ్గాన్ జట్టులో ఇబ్రహీం (64 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) నజీబుల్లా (బి) ఫరీద్ 62; కోహ్లి నాటౌట్ 122; సూర్యకుమార్ (బి) ఫరీద్ 6; పంత్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–119, 2–125.
బౌలింగ్: ఫారుఖి 4–0–51–0, ముజీబ్ 4–0–29–0, ఫరీద్ 4–0–57–2, రషీద్ 4–0–33–0, నబీ 3–0–34–0, అజ్మతుల్లా 1–0–8–0.
అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: హజ్రతుల్లా (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; రహ్మతుల్లా (బి) భువనేశ్వర్ 0; ఇబ్రహీమ్ నాటౌట్ 64; కరీమ్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 2; నజీబుల్లా (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; నబి (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 7; అజ్మతుల్లా (సి) కార్తీక్ (బి) భువనేశ్వర్ 1; రషీద్ (సి) అక్షర్ (బి) హుడా 15, ముజీబ్ (బి) అశ్విన్ 18; ఫరీద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 111.
వికెట్ల పతనం: 1–0, 2–1, 3–9, 4–9, 5–20, 6–21, 7–54, 8–87.
బౌలింగ్: భువనేశ్వర్ 4–1–4–5, దీపక్ 4–0–28–0, అర్‡్షదీప్ 2–0–7–1, అక్షర్ 4–0–24–0, అశ్విన్ 4–0–27–1, హుడా 1–0–3–1, దీనేశ్ కార్తీక్ 1–0–18–0.
అంతర్జాతీయ టి20ల్లో కోహ్లికి ఇది తొలి సెంచరీ. గతంలో 94 నాటౌట్ (హైదరాబాద్‌లో, వెస్టిండీస్‌పై–2019 డిసెంబర్ 6) అతని అత్యధిక స్కోరు.
ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లి చివరిసారిగా 2019 నవంబర్ 23న కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ సాధించాడు.
122: టి20ల్లో భారత్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. టీమిండియా ఆటగాళ్లు 10 సెంచరీలు నమోదు చేయగా కోహ్లికంటే ముందు రోహిత్ (4 సెంచరీలు), రాహుల్ (2), రైనా, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనత సాధించారు.
71: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల్లో రికీ పాంటింగ్ (71)తో కోహ్లి సమంగా నిలిచాడు. అతను టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. సచిన్ (100) అగ్రస్థానంలో ఉన్నాడు.
సెంచరీల మధ్య ఇంత విరామం రావడటం నిజంగా నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నేను 60 పరుగులు చేసినా విఫలం అయ్యాడనడం కూడా ఆశ్చర్యపరిచేది. ఇంత కాలంగా కూడా చాలా బాగా ఆడుతున్నా సెంచరీకి అది సరిపోలేదేమో. గతంలోనూ నాకు దేవుడు ఎన్నో గొప్ప క్షణాలు అందించాడు. ఇదీ దైవనిర్ణయమే. కష్టపడటమే మన చేతుల్లో ఉంది. నేనూ ఈ రోజు చాలా పట్టుదలగా బ్యాటింగ్ చేశా. ఆసియా కప్‌కు ముందు చాలా మంది నాకు ఎన్నో సలహాలిచ్చారు. నేనూ బాగా ఆడిన పాత వీడియోలు మళ్లీ మళ్లీ చూసుకున్నాను. కానీ ఆట మాత్రం అదే. మానసికంగానే ఏదో సమస్య ఉందని అనిపించి కొంత విరామం తీసుకున్నా. ఇప్పుడు కొత్త ఉత్సాహంతో వచ్చి బాగా ఆడా. నా కష్టకాలంలో అండగా నిలిచిన నా భార్య నేను జీవితాన్ని చూసే ధోరణితో మార్పు తెచ్చింది. ఆమెతో పాటు నా కూతురు వామికకు ఈ సెంచరీ అంకితం’
చదవండి: Virat Kohli: 'కింగ్ ఈజ్ బ్యాక్'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
Comments
Please login to add a commentAdd a comment