తొమ్మిదో స్థానానికి ఎగబాకిన విరాట్‌.. టాప్‌ 10లో ఒకే ఒక్కడు | Virat Kohli Climbs To 9th Position In ICC Test Batsmen Rankings | Sakshi

తొమ్మిదో స్థానానికి ఎగబాకిన విరాట్‌.. టాప్‌ 10లో ఒకే ఒక్కడు

Jan 3 2024 2:50 PM | Updated on Jan 3 2024 3:02 PM

Virat Kohli Climbs To 9th Position In ICC Test Batsmen Rankings - Sakshi

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లి తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. భారత్‌ నుంచి టాప్‌ 10లో చోటు దక్కించుకున్న ఏకైక బ్యాటర్‌ విరాటే కావడం విశేషం. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో ప్రదర్శన (38, 76) ఆధారంగా విరాట్‌ నాలుగు స్థానాలు (761 రేటింగ్‌ పాయింట్లు) మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి చేరాడు.

ఇదే టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కేఎల్‌ రాహుల్‌ (101) సైతం భారీగా పాయింట్లు మెరుగుపర్చుకుని (508 పాయింట్లు) 51వ స్థానానికి చేరాడు. రాహుల్‌ తన శతక ప్రదర్శనతో ఏకంగా 11 స్థానాలు ఎగబాకాడు.

మరోవైపు తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నాలుగు స్థానాలు దిగజారి 14వ స్థానానికి పడిపోగా.. యాక్సిడెంట్‌ కారణంగా ఏడాదికాలంగా జట్టుకు దూరంగా ఉన్న రిషబ్‌ పంత్‌ 12వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లు పుజారా 35, రవీంద్ర జడేజా 38, శ్రేయస్‌ అయ్యర్‌ 42, అజింక్య రహానే 44, అక్షర్‌ పటేల్‌ 50, శుభ్‌మన్‌ గిల్‌ 55, యశస్వి జైస్వాల్‌ 69, అశ్విన్‌ 79, శార్దూల్‌ ఠాకూర్‌ 99వ స్థానాల్లో నిలిచారు.

తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌ ఆతర్వాతి స్థానాలను కాపాడుకున్నారు. మరో న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో స్థానానికి చేరగా.. ఆసీస్‌ ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌ నాలుగు స్థానాలు కోల్పోయి 10వ స్థానానికి పడిపోయాడు. 

టెస్ట్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలో అశ్విన్ అగ్రస్థానాన్ని కాపాడుకోగా.. జడేజా, బుమ్రా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. షమీ రెండు స్థానాలు పడిపోయి 20వ స్థానానికి చేరగా.. సిరాజ్‌ 30, అక్షర్‌ పటేల్‌ 32 స్థానాల్లో నిలిచారు. భారత్‌తో తొలి టెస్ట్‌లో రెచ్చిపోయిన రబాడ రెండు స్థానాన్ని పదిలం చేసుకోగా.. పాకిస్తాన్‌తో రెండో టెస్ట్‌లో 10 వికెట్ల ప్రదర్శనతో ఇరగదీసిన కమిన్స్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

టీమ్‌ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. ఈ విభాగంలో టీమిండియా టాప్‌లో కొనసాగుతుండగా.. ఆసీస్‌, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే టాప్‌ 10లో నిలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement