
న్యూఢిల్లీ: అధికారికంగా తనకు కెప్టెన్ హోదా లేకపోయినా... జట్టు కోసం పని చేసేందుకు దాని అవసరం లేదని మాజీ సారథి విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ కాకపోయినా ఒక బ్యాటర్ గా, సీనియర్ ప్లేయర్‌గా తాను కీలక బాధ్యత పోషిస్తానని అన్నాడు. ఇకపై బ్యాటర్‌గా తాను మరిన్ని గొప్ప ప్రదర్శనలతో టీమిండియాకు విజయాలు అందిస్తానని కోహ్లి విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘కెప్టెన్సీ గురించి నేను ఇలా చేశానేమిటి అని చాలా మంది అనుకొని ఉండవచ్చు. అయితే నా దృష్టిలో ప్రతీదానికి సమయం ఉంటుంది. దాని గురించి మనకు తెలిసుండాలి. ఇక్కడి వరకు మన బాధ్యత పూర్తయినట్లుగా భావించి ముందుకు వెళ్లాలి. ఇకపై ఒక బ్యాటర్‌గా నేను జట్టుకు ఇంకా చాలా చేస్తానేమో.
నాయకుడిలాగే ముందుండి నడిపించాలంటే కెప్టెనే కానవసరం లేదు’ అని ఈ స్టార్ బ్యాటర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎమ్మెస్ ధోని కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాడని... అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా అలాంటి భావన ఏమీ రాకుండా అన్ని అంశాల్లో భాగమవుతూ తగిన సూచనలు, సలహాలు ఇచ్చేవాడని కోహ్లి గుర్తు చేసుకున్నాడు. ‘అతడి నుంచి నేను కెప్టెన్సీ తీసుకోవడమనేది సహజ పరిణామమని, ఇది భారత జట్టుకు భవిష్యత్తులో మేలు చేస్తుందని ధోని భావించాడు. పరిస్థితులను అర్థం చేసుకొని సరైన సమయంలో తప్పుకోవడం కూడా నాయకత్వ లక్షణమే. అప్పటి వరకు ఒకేలా ఉన్న వాతావరణంలో కొంత మార్పు జరిగితే మంచిదే కదా. కొత్త తరహా ఆలోచనలతో కొత్తగా ఏదైనా చేయవచ్చు కూడా. ఎలాంటి బాధ్యతలకైనా సిద్ధంగా ఉండాలి’ అని కోహ్లి అన్నాడు.