నేను అంపైర్‌తో మాట్లాడాను.. కానీ: కోహ్లి | Virat Kohli Says That lbw Was Strange Umpire Said Nothing Can Be Done | Sakshi
Sakshi News home page

అంపైర్‌.. ఇంకేం చేయలేం అన్నాడు: కోహ్లి

Published Wed, Dec 9 2020 4:46 PM | Last Updated on Thu, Dec 10 2020 5:42 AM

Virat Kohli Says That lbw Was Strange Umpire Said Nothing Can Be Done - Sakshi

అంపైర్లతో మాట్లాడుతున్న కోహ్లి(కర్టెసీ: ట్విటర్‌)

సిడ్నీ: ‘‘నేను రాడ్‌తో(టకర్ రాడ్‌, అంపైర్‌) చర్చించా. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చు అని అడిగాను. ఇది టీవీ వల్ల జరిగిన తప్పిదం.. మనం ఇంకేం చేయలేమని అతడు నాతో చెప్పాడు’’ అని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మంగళవారం నాటి మ్యాచ్‌లో జరిగిన ‘‘రివ్యూ డ్రామా’’ గురించి చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.  ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఆసీస్ కోహ్లి సేనపై గెలుపొందింది. ఓపెనర్‌ వేడ్, మ్యాక్స్‌వెల్‌ హాఫ్‌ సెంచరీలకు తోడు స్పిన్నర్ల పొదుపైన బౌలింగ్‌తో ఆతిథ్య జట్టుకు ఊరట విజయం లభించింది. అయితే 11వ ఓవర్‌లో టీమిండియా వేగంగా స్పందించి రివ్యూ కోరి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఓవర్‌లో భారత బౌలర్‌ నటరాజన్‌ వేసిన నాలుగో బంతి ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ ప్యాడ్లను తాకింది. దీని గురించి నటరాజన్‌, వికెట్‌ కీపర్‌ రాహుల్‌ అప్పీల్‌ చేయగా అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. (చదవండి: చిన్నప్పటి నుంచి నేనింతే: నటరాజన్‌)

ఇక ఈ అంశంపై టీమిండియా రివ్యూ కోరే లోపే భారీ స్క్రీన్‌పై రీప్లే కనిపించింది. దీంతో కెప్టెన్‌ కోహ్లి రివ్యూ కోరే లోపే థర్డ్‌ అంపైర్‌ అతడి అభ్యర్థన చెల్లదని ప్రకటించాడు. దాంతో ఫీల్డ్‌ అంపైర్‌ నిర్ణయానికే భారత జట్టు కట్టుబడింది. అయితే చివరకు రీప్లేలో అది స్పష్టంగా అవుట్‌ అయినట్లు కనిపించడంతో తాము అన్యాయంగా వికెట్‌ చేజార్చుకున్నామని కోహ్లి సేన బాధపడాల్సి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన కోహ్లి.. సమయం ముగిసేలోపే రివ్యూ కోరినట్లు వెల్లడించాడు. ‘‘ఆ ఎల్బీడబ్ల్యూ విచిత్రమైంది. రివ్యూకు వెళ్లాలా.. వద్దా అని మేం చర్చించుకునే లోపే.. అంపైర్‌ తన నిర్ణయం ప్రకటించాడు. రివ్యూ కోరాలని నిర్ణయించుకునే లోపే స్క్రీన్‌పై కూడా ప్లే అయ్యింది. ఎంతో ముఖ్యమైన మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం సరికాదు. టీవీ వాళ్ల చిన్న తప్పిదం కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి న పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటివి పునరావృతం కాకూడదు. మా స్థానంలో ఎవరు ఉన్నా సరే ఇలా వికెట్‌ను మిస్‌ చేసుకోవడాన్ని ఇష్టపడరు కదా’’ అని పేర్కొన్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement