బ్యాటింగ్ చేస్తున్న రిషభ్ పంత్(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. తన బ్యాటింగ్ చూస్తుంటే తాను దేశానికి ఆడిన నాటి రోజులు గుర్తుకువస్తున్నాయని పేర్కొన్నాడు. ఇతరులు ఏమనుకున్నా పంత్ లెక్కచేయడని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతాడన్నాడు. కాగా పుణెలో ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డే తుదిజట్టులో పంత్ చోటు దక్కని సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రెండు, మూడో వన్డేల్లో ఆడే అవకాశం లభించగా దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. వరుసగా 77, 78 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్‌లో అత్యంత సానుకూల విషయం.. రిషభ్ పంత్ ఫాం కొనసాగించడమే. వన్డేల్లో రెండో పవర్‌ప్లేలో తను చక్కగా ఆడతాడు. తను పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉంటాడు. తనను చూస్తుంటే, తొలినాళ్లలో నేను క్రికెట్ ఆడిన విధానం గుర్తుకువస్తుంది. ఎదురుగా ఎవరున్నా బ్యాట్‌తో విరుచుకుపడటమే తనకు తెలుసు’’ అని కితాబిచ్చాడు.
అదే విధంగా, తన ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్లుగా మలిచే గుణాన్ని అలవరచుకుంటే, పంత్ టీమిండియా భవిష్యత్ సూపర్‌స్టార్ అవుతాడని సెహ్వాగ్ జోస్యం చెప్పాడు. ఓపికగా ఆడుతూ ఉంటే, పంత్ వన్డే, టీ20 జట్టులో తప్పకుండా ఎల్లప్పుడూ చోటు దక్కించుకుంటాడని పేర్కొన్నాడు. ‘‘70- 80 పరుగులను సెంచరీగా మలిచే అంశంపై పంత్ దృష్టి సారించాలి. అలా అయితే తనే టీమిండియా సూపర్‌స్టార్ అవుతాడు. ఇందుకోసం తన సామర్థ్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment