
రిషభ్ పంత్- వీరేంద్ర సెహ్వాగ్
తానే గనుక పంత్ స్థానంలో ఉంటే కచ్చితంగా సిక్స్ కొట్టేవాడినన్న సెహ్వాగ్!
India Vs England ODI Series 2022- India Win: ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో అదరగొట్టిన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చిన పంత్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా సహా వసీం జాఫర్ వంటి పలువురు మాజీ ఆటగాళ్లు కొనియాడుతున్నారు.
మాంచెస్టర్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంత్.. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా 42 ఓవర్‌లో డేవిడ్ విల్లే బౌలింగ్‌లో వరుసగా ఐదు ఫోర్లు బాది వారెవ్వా అనిపించాడు. దీంతో బిక్క మొహం వేయడం విల్లే వంతైంది.
నేను గనుక పంత్ స్థానంలో ఉండి ఉంటే!
అయితే, పంత్ ఈ ఓవర్‌లో ఆఖరి బంతికి సింగిల్ తీయడంపై టీమిండియా మాజీ ఓపెనర్, విధ్వంసకర బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తానే గనుక పంత్ స్థానంలో ఉండి ఉంటే ఆఖరి బంతికి ఫోర్ లేదంటే సిక్స్ కొట్టేవాడినని వ్యాఖ్యానించాడు.
ఈ మేరకు మ్యాచ్ అనంతరం సోనీ స్పోర్ట్స్ షోలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ 42వ ఓవర్ చివరి బంతికి పంత్ గనుక ఫోర్ కొట్టి ఉంటే మ్యాచ్ అపుడే ముగిసేది. అదనంగా పరుగు తీయాల్సిన అవసరం కూడా లేదు. అయితే, పంత్.. ఆ బంతిని ఫోర్ కాదు.. ఏకంగా సిక్స్‌గా మలచాల్సింది. ఒకవేళ నేనే గనుక రిషభ్ పంత్ స్థానంలో ఉంటే కచ్చితంగా ఫోర్ లేదంటే సిక్సర్ బాదేవాడిని’’ అని పేర్కొన్నాడు.
ఇక వన్డేల్లో పంత్‌కు ఇదే మొదటి శతకం కావడంతో.. వన్డే క్రికెట్‌లో రిషభ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నామన్న వీరూ భాయ్.. ఈ మ్యాచ్‌లో అద్భుతం చేశాడని కొనియాడాడు. కాగా 43వ ఓవర్ మొదటి బంతికి పంత్ ఫోర్ కొట్టడంతో టీమిండియా విజయం ఖరారైంది. ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ మీద గెలుపొంది సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
చదవండి: Rohit Sharma: ఇంగ్లండ్ గడ్డ మీద గెలవడం అంత ఈజీ కాదు! అంతా వాళ్లిద్దరి వల్లే..