IND Vs ENG Test 5th: Rishabh Pant Century-Jadeja Innings Put India Top At Stumps, Details Inside - Sakshi
Sakshi News home page

IND Vs ENG Test Day 1: పంత్‌ పరాక్రమం.. మెరుగైన స్థితిలో టీమిండియా

Published Sat, Jul 2 2022 12:57 AM | Last Updated on Sat, Jul 2 2022 8:50 AM

Rishabh Pant Century-Jadeja Innings Put India Top At Stumps IND vs ENG - Sakshi

ఆకాశం మేఘావృతమై ఉంది... ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచింది... ఇంకేముంది... మరో ఆలోచన లేకుండా స్టోక్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు! అతని నమ్మకాన్ని బౌలర్లు వమ్ము చేయలేదు. భారత ప్రధాన బ్యాటర్లను కుదురుకోనీయలేదు. గిల్, పుజారా, విహారి, కోహ్లిలకు తోడు శ్రేయస్‌ అయ్యర్‌ కూడా పెవిలియన్‌ చేరారు.

భారత్‌ స్కోరు 98/5... బౌలర్ల జోరు ఇలాగే సాగితే రెండో సెషన్‌లో రెండు వందలకు లోపే జట్టు ఆలౌట్‌ అయిపోయేదేమో! కానీ రిషభ్‌ పంత్‌ ఇంగ్లండ్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. బౌలర్లపై ఎదురు దాడికి దిగి ఒంటి చేత్తో ఆటను మలుపు తిప్పాడు.  ఇటీవల పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో తన బ్యాటింగ్‌పై వస్తున్న అనుమానాలను టెస్టు ఇన్నింగ్స్‌తో పటాపంచలు చేశాడు.

విదేశాల్లో భారత ఆటగాళ్లు సాధించిన అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలిచిపోయే ప్రదర్శనతో తన విలువేంటో చూపించాడు. పంత్‌ను ఎలా ఆపాలో తెలీక ఇంగ్లండ్‌ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. మరో ఎండ్‌లో సమయోచిత బ్యాటింగ్‌తో జడేజా అందించిన సహకారం టీమిండియాను మెరుగైన స్థితికి చేర్చింది.   

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో భారత్‌కు మంచి పునాది పడింది. బ్యాటింగ్‌తో ఆధిపత్యం ప్రదర్శించిన మన జట్టు శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (111 బంతుల్లో 146; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో చెలరేగగా, రవీంద్ర జడేజా (163 బంతుల్లో 83 బ్యాటింగ్‌; 10 ఫోర్లు) శతకానికి చేరువయ్యాడు.

వీరిద్దరు ఆరో వికెట్‌కు 222 పరుగులు జోడించడం విశేషం. ఇంగ్లండ్‌ బౌలర్లలో అండర్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం రవీంద్ర జడేజాతో పాటు మొహమ్మద్‌ షమీ (0 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో రోజు మిగిలిన 3 వికెట్లతో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు జోడిస్తే భారత్‌కు మ్యాచ్‌పై పట్టు లభిస్తుంది. తొలి రోజు ఏకంగా 4.63 రన్‌రేట్‌తో పరుగులు రావడం విశేషం. భారత వికెట్‌ కీపర్లలో వేగవంతమైన సెంచరీ (89 బంతుల్లో) నమోదు చేసిన ఆటగాడిగా పంత్‌ నిలిచాడు.  

మెరుపు బ్యాటింగ్‌... 
ఓపెనర్లు గిల్‌ (17), పుజారా (13) ఎక్కువ సేపు నిలవలేకపోవడంతో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. 6 పరుగుల వద్ద క్రాలీ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన విహారి (20) దానిని వాడుకోలేకపోగా, పాట్స్‌ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక కోహ్లి (11) బౌల్డయ్యాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (15) కూడా విఫలం కావడంతో భారత్‌ సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పంత్‌ స్కోరు 13, జడేజా స్కోరు 0 పరుగులు!

వేగంగా ఆడిన జడేజా 24 పరుగులకు చేరగా, పంత్‌ 25 వద్ద నిలిచాడు. ఆ తర్వాత పంత్‌ విధ్వంసం షురూ అయింది. లీచ్‌ తొలి ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6తో దూకుడు మొదలు పెట్టిన అతను 51 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అతను ఏ బౌలర్‌నూ వదలకుండా జోరు పెంచాడు.

పాట్స్‌ బౌలింగ్‌లో 7 ఫోర్లు కొట్టిన అతను లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ లీచ్‌పై విరుచుకుపడ్డాడు. అతని ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో 96కు చేరిన పంత్‌ ... బ్రాడ్‌ బౌలింగ్‌లో ఫైన్‌లెగ్‌ దిశగా ఆడి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని శతకానికి డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి భారత ఆటగాళ్లు చప్పట్లతో అభినందించగా... సాధారణంగా ప్రశాంతంగా కనిపించే కోచ్‌ ద్రవిడ్‌ కూడా భావోద్వేగాలు ప్రదర్శించడం ఇన్నింగ్స్‌ ప్రత్యేకతను చూపించింది.

అదే ఓవర్లో 109 బంతుల్లో జడేజా హాఫ్‌ సెంచరీ పూర్తయింది. అనంతరం లీచ్‌ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4, 6 బాది పంత్‌ 22 పరుగులు రాబట్టాడు. సుదీర్ఘ భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు పార్ట్‌టైమర్‌ రూట్‌ చక్కటి బంతితో పంత్‌ను అవుట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ శిబిరం కాస్త ఊరట పొందింది. అయితే మరో ఎండ్‌లో మాత్రం జడేజా పట్టుదలగా నిలబడి ఆటను ముగించాడు.

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) క్రాలీ (బి) అండర్సన్‌ 17; పుజారా (సి) క్రాలీ (బి) అండర్సన్‌ 13; విహారి (ఎల్బీ) (బి) పాట్స్‌ 20; కోహ్లి (బి) పాట్స్‌ 11; పంత్‌ (సి) క్రాలీ (బి) రూట్‌ 146; శ్రేయస్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) అండర్సన్‌ 15; జడేజా (బ్యాటింగ్‌) 83; శార్దుల్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) స్టోక్స్‌ 1; షమీ (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు 32; మొత్తం (73 ఓవర్లలో 7 వికెట్లకు) 338. వికెట్ల పతనం: 1–27, 2–46, 3–64, 4–71, 5–98, 6–320, 7–323. బౌలింగ్‌: అండర్సన్‌ 19–4–52–3, బ్రాడ్‌ 15–2–53–0, పాట్స్‌ 17–1–85–2, లీచ్‌ 9–0–71–0, స్టోక్స్‌ 10–0–34–1, రూట్‌ 3–0–23–1.

టెస్టుల్లో పంత్‌కు ఇది ఐదో సెంచరీ. ఇందులో నాలుగు విదేశాల్లోనే (ఓవల్, సిడ్నీ, కేప్‌టౌన్, బర్మింగ్‌హామ్‌) వచ్చాయి. మరొకటి అహ్మదాబాద్‌లో చేశాడు. 
చదవండి: Ind Vs Eng: అసలు అంచనాలే లేవు... అయినా కూడా నువ్వు మరోసారి! ఎన్నాళ్లో ఇలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement