
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, ఆకాశ్ చోప్రాలు ప్రశంసల వర్షం కురిపించారు. అశ్విన్ అత్యుత్తమ ఆటగాడని, రాక్ స్టార్ అని, బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నరని కొనియాడాడు. టీమిండియా సొగసరి బ్యాట్స్‌మెన్‌గా ప్రఖ్యాతి గాంచిన వీవీఎస్ లక్ష్మణ్.. అశ్విన్ ప్రదర్శనను ఆకాశానికెత్తాడు. అశ్విన్ చాలా తెలివైన ఆటగాడని, నైపుణ్యంతో పాటు సరైన ప్రణాళిక కలిగి ఉంటాడని మెచ్చుకున్నాడు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆటగాళ్లు కేవలం నైపుణ్యంపైనే ఆధారపడకుండా సరైన ప్రణాళికలు కలిగి ఉండాలని.. అది అశ్విన్‌కు బాగా తెలుసునని కితాబునిచ్చాడు.
అశ్విన్ బ్యాట్స్‌మెన్ బలహీనతలను కనిపెట్టి, వాటిపై సుదీర్ఘ సాధన చేస్తాడన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో స్టీవ్‌స్మిత్‌ను ఈ ప్లాన్ ప్రకారమే బోల్తా కొట్టించాడని గర్తు చేశారు. మరో భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. అశ్విన్ రాక్‌స్టార్ అని, అతను టీమిండియా బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నరని కొనియాడాడు. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ కుంబ్లేనే అయినప్పటికీ.. అశ్విన్ అతనికి ఏమాత్రం తీసిపోడని, ఇందుకు అతని గణాంకాలే( 77 టెస్టుల్లోనే 400 వికెట్లు) నిదర్శనమన్నాడు. అతనిపై వచ్చిన విమర్శలకు బంతితో బదులిస్తున్న విధానం చూస్తే అతనో రాక్ స్టార్‌లా కనిపిస్తాడన్నాడు. ఇటీవల కాలంలో అతని ప్రదర్శనలు చూస్తే.. బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అనక తప్పదన్నారు.