హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఆఖరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించగానే అభిమానుల గుండెలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. డ్రా చేయడం కూడా అసాధ్యమే అనుకున్న గబ్బా మైదానంలో భారత జట్టు విజయఢంకా మోగించడంతో సామాన్యులు మొదలు రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖుల ట్వీట్లతో సోషల్ మీడియా మోత మోగింది. దేశం మొత్తం భావోద్వేగానికి లోనైన చిరస్మరణీయ విజయం అది. అందరిలాగే తాను కూడా బ్రిస్బేన్ టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించగానే ఉద్వేగానికి గురయ్యాయని తెలిపాడు టెస్టు స్పెషలిస్టు వీవీఎస్ లక్ష్మణ్. శుభవార్త తెలియగానే తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని పేర్కొన్నాడు.(చదవండి: ఇంగ్లండ్ ఒక్క టెస్ట్ కూడా గెలువలేదు: గంభీర్)
తాజాగా స్పోర్ట్స్ టుడేతో మాట్లాడిన లక్ష్మణ్.. ‘‘బ్రిస్బేన్ టెస్టు ఆఖరి రోజు మ్యాచ్‌ను కుటుంబంతో కలిసి వీక్షించాను. రిషభ్, వాషింగ్టన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టెన్షన్ తారస్థాయికి చేరింది. ఎలాగైనా సరే ఇండియా ఆసీస్‌తో టెస్టు సిరీస్ గెలవాలని బలంగా కోరుకున్నా. ముఖ్యంగా అడిలైడ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావించా. అంతేకాదు గబ్బా టెస్టుకు ముందు, బ్రిస్బేన్‌లో ఆడేందుకు ఇండియన్స్ భయపడతారంటూ కామెంట్లు వినిపించాయి. అయితే ఎక్కడైతే ఆసీస్‌కు మంచి రికార్డు ఉందో అక్కడే టీమిండియా అద్భుత విజయం సొంతం చేసుకుంది. అప్పుడు నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి’’ అని గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.(చదవండి: ఆసీస్ టూర్: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!)
ఇక ఆసీస్ టూర్‌లో లభించిన అవకాశం సద్వినియోగం చేసుకున్న తమిళనాడు బౌలర్ నటరాజన్‌పై వీవీఎస్ ప్రశంసలు కురిపించాడు. ‘‘మంచివాళ్లకు మంచే జరుగుతుంది. నటరాజన్ అన్ని రకాల ప్రశంసలకు అర్హుడు. అవకాశం కోసం నట్టూ ఎంతో ఓపికగా ఎదురుచూశాడు. మానసిక స్థైర్యంతో ముందుకు సాగాడు. బలమైన ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు’’ అని కొనియాడాడు. కాగా నెట్‌బౌలర్‌గా ఆస్ట్రేలియాకు వెళ్లిన నటరాజన్.. మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. మొత్తంగా 11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీశాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లక్ష్మణ్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నటరాజన్ మైదానంలో దిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment