PC: X
మహిళా టీ20 ప్రపంచకప్-2024లో న్యూజిలాండ్ బ్యాటర్ అమేలియా కెర్ రనౌట్ విషయంలో అంపైర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. దీంతో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. అసలేం జరిగిందంటే..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ న్యూజిలాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడింది. దుబాయ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. హర్మన్‌ప్రీత్ సేనను బౌలింగ్‌కు ఆహ్వానించింది.
ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ దీప్తి శర్మ పద్నాలుగో ఓవర్ ఆఖరి బంతిని ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించింది. అప్పుడు క్రీజులో ఉన్న అమేలియా కెర్ లాంగాఫ్ దిశగా షాట్ బాదగా.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బంతిని అందుకుంది. అప్పటికి అమేలియా సోఫీ డివైన్‌తో కలిసి సింగిల్ పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలో ఓవర్ ముగిసింది కాబట్టి హర్మన్ బంతిని త్రో చేయకుండా అలాగే చేతుల్లో పట్టుకుంది. దీనిని ఆసరాగా తీసుకున్న కివీస్ బ్యాటర్లు మరో పరుగు కోసం యత్నించారు. అంతలో హర్మన్ వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు బంతిని అందించగా.. అమేలియా రనౌట్ అయింది.
కానీ.. అంపైర్ మాత్రం అప్పటికే బంతి డెడ్ అయినట్లు ప్రకటించారు. నిజానికి కివీస్ బ్యాటర్లు రెండో పరుగు కోసం ప్రయత్నించకముందే ఫీల్డ్ అంపైర్.. బౌలర్ దీప్తి క్యాప్‌ను ఆమెకు తిరిగి ఇచ్చేశారు. అప్పటికే హర్మన్ చేతిలో బంతి ఉండి ఐదు సెకన్లకు పైగా కాలం గడవడంతో బంతిని డెడ్‌గా ప్రకటించారు. అయినప్పటికీ న్యూజిలాండ్ డబుల్‌కు యత్నించగా.. అమేలియా రనౌట్ అయింది. దీంతో ఆమె తాను అవుటైనట్లు భావిస్తూ పెవిలియన్‌కు వెళ్తుండగా.. అంపైర్లు మాత్రం ఆమెను వెనక్కి పిలిపించారు.
దీంతో అమేలియా మళ్లీ తన స్థానంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంతి డెడ్ అయిందనుకుని తాము నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తే.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించినా వారికి అనుకూలంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది.
ఈ క్రమంలో కాసేపు వివాదం నెలకొనగా.. మళ్లీ ఆట మొదలైంది. ఆ తర్వాతి ఓవర్‌లో రెండో బంతికే అమేలియా కెర్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రేణుకా సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయింది. మ్యాచ్ అనంతరం ఈ విషయం గురించి భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. అంపైర్లు ఇలా వ్యవహరించడం సరికాదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. సమిష్టిగా విఫలమై 58 పరుగుల తేడాతో పరాజయం పాలై.. తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదుర్కొంది.
చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్ విజయం మాదే: బంగ్లా కెప్టెన్
OUT or NOT OUT 🧐
Animated Harmanpreet Kaur Spotted🔥🔥
🇮🇳#INDvsNZ #WomenInBlue #T20WorldCup pic.twitter.com/QJVYKG6ZIE— Sports In Veins (@sportsinveins) October 4, 2024
Comments
Please login to add a commentAdd a comment