భారత జట్టు (ఫైల్ ఫొటో)
ICC ODI WC 2023: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పునరాగమనంలో అదరగొడుతున్నాడు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో అభిమానుల మనసు గెలుచుకుంటూ భారత జట్టు విజయాల్లో భాగమవుతున్నాడు. కాగా వెన్నునొప్పి కారణంగా సుమారు పదకొండు నెలల పాటు బుమ్రా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే.
రీఎంట్రీలో అదరగొడుతూ.. మెగా టోర్నీలో
ఈ క్రమంలో ఐర్లాండ్‌తో ఆగష్టులో టీ20 సిరీస్ సందర్భంగా కెప్టెన్ హోదాలో రీఎంట్రీ ఇచ్చాడు. తొలిసారి టీ20 జట్టు పగ్గాలు చేపట్టి సఫలమయ్యాడు. సిరీస్ గెలిచిన తర్వాత.. ఆసియా కప్-2023 వంటి ప్రతిష్టాత్మక మెగా వన్డే టోర్నీలోనూ సత్తా చాటాడు.
ఈ నేపథ్యంలో ఆసియా విజేత టీమిండియా ప్రధాన పేసర్‌గా వన్డే వరల్డ్‌కప్-2023లో అడుగుపెట్టిన బుమ్రా ఇప్పటికే జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో తన విలువేమిటో చాటుకున్నాడు. ఎనిమిది వికెట్లు కూల్చి రోహిత్ సేన వరుస విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. కీలక సమయంలో వికెట్లు తీస్తూ
ముఖ్యంగా దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా.. ఆరంభం నుంచే పొదుపుగా బౌలింగ్ చేసి రెండు కీలక వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చిరకాల ప్రత్యర్థిపై విజయం భారత్ జయభేరి మోగించడంలో ప్రధాన పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఒత్తిడికి లోను కాను.. సవాళ్లంటే నాకిష్టం
ఈ నేపథ్యంలో ఐసీసీ షోలో మాట్లాడిన జస్‌ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నేనెప్పుడూ ఒత్తిడికి లోనుకాను.. ఎందుకంటే.. చిన్ననాటి నుంచే క్రికెటర్ కావాలన్న కోరిక నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అవరోధాలు దాటి ఇక్కడి దాకా వచ్చాను.
దేశానికి ఆడాలన్నదే నా లక్ష్యం. ఈ క్రమంలో ఎదురైన సవాళ్లను నేను సంతోసంగా స్వీకరిస్తాను. నా జట్టును గెలిపించాలనే తపనతోనే ఆడతాను’’ అంటూ ఐసీసీ మెగా టోర్నీలోనూ తాను ఎలాంటి ఒత్తిడికి గురవడం లేదని బుమ్రా వెల్లడించాడు.
అలా అయితే సరిగ్గా ఆడలేం
ఇక భారత్‌లో పిచ్ పరిస్థితుల గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఆడుతున్నాను. నా అనుభవాన్ని ఉపయోగించి జట్టుకు ఉపయోగపడే విధంగా.. వీలైనంత ఎక్కువ శ్రమిస్తాను. ఒత్తిళ్లు, అంచనాలు, బాధ్యతలు.. ఇలా వీటిలో దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించను.
ఒకవేళ అవన్నీ మనసులో పెట్టుకుంటే మనం అనుకున్న రీతిలో ప్రదర్శన చేయలేం’’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు. తన పని తాను చేసుకుంటూ పోతే ఫలితాలు అవే వస్తాయని పేర్కొన్నాడు. కాగా బుమ్రాకు మరో పేసర్, హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ సైతం తన ప్రతిభతో జట్టు విజయాల్లో కీలకంగా మారుతున్నాడు. పాక్‌తో మ్యాచ్‌లో ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు.
చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్ ఆజం
Comments
Please login to add a commentAdd a comment