‘జడ్డూ వారసుడు’.. వాషింగ్టన్‌ సుందర్‌ రియాక్షన్‌ ఇదే | Washington Sundar Reacts On Being Seen As Ravindra Jadeja Replacement For India In T20I Cricket | Sakshi
Sakshi News home page

Ind vs Zim: ‘జడ్డూ వారసుడు’.. వాషింగ్టన్‌ సుందర్‌ రియాక్షన్‌ ఇదే

Published Thu, Jul 11 2024 2:16 PM | Last Updated on Thu, Jul 11 2024 3:58 PM

Washington Sundar Reacts On Being Seen As Ravindra Jadeja Replacement

జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ నిలకడగా రాణిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో 27 పరుగులు చేయడంతో పాటు.. కీలక సమయంలో రెండు వికెట్లు తీశాడు.

ఆ మ్యాచ్‌ల్‌ భారత్‌ ఓడినా వాషీ మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక రెండో టీ20లో టాపార్డర్‌ అదరగొట్టడంతో సుందర్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాలేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 234 భారీ స్కోరు నెలకొల్పగా.. జింబాబ్వే 134 పరుగులకే కుప్పకూలింది.

ఇందులో వాషింగ్టన్‌ సుందర్‌ కూడా తన వంతు పాత్ర పోషించాడు. జొనాథన్‌ కాంప్‌బెల్‌ వికెట్‌ దక్కించుకోవడంతో పాటు లోయర్‌ ఆర్డర్‌లో నిలదొక్కుకున్న ల్యూక్‌ జోంగ్వే ఇచ్చిన క్యాచ్‌ పట్టాడు.

ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ సేన 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక కీలకమైన మూడో టీ20లోనూ 23 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇందులో వాషింగ్టన్‌ సుందర్‌దే కీలక పాత్ర.

హరారే వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టీమిండియా విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే తడబడింది. భారత బౌలర్ల దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకే పరిమితమైంది.

వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుత బౌలింగ్‌(3/15)తో రాణించి టీమిండియాను గెలిపించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో విజయానంతరం వాషింగ్టన్‌ సుందర్‌ మాత్రం మాట్లాడుతూ.. దేశానికి ఆడటం తనకు ఎల్లప్పుడూ అద్భుతంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. తీవ్ర ఒత్తిడి నెలకొన్నా ప్రణాళికలను పక్కా అమలు చేసి గెలుపొందామని హర్షం వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా.. టీ20లలో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ వాషీకి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘జట్టు కోసం నేనేం చేయగలనో అన్నీ చేస్తాను.

ప్రతీ మ్యాచ్‌ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతాను. ప్రతీసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేస్తాను. ఆ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడను’’ అని వాషింగ్టన్‌ సుందర్‌ పేర్కొన్నాడు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను పూర్తి చేయడంపై మాత్ర దృష్టి సారిస్తానని స్పష్టం చేశాడు.

కాగా చెన్నైకి చెందిన వాషింగ్టన్‌ సుందర్‌ 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. లెఫ్టాండ్‌ బ్యాటర్‌ అయిన వాషీ.. రైటార్మ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌.

ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 4 టెస్టులు, 19వన్డేలు, 46 టీ20లు ఆడి 265, 265, 134 పరుగులు చేశాడు. అదే విధంగా ఆయా ఫార్మాట్లలో ఆరు, 18, 40 వికెట్లు తీశాడు వాషింగ్టన్‌ సుందర్‌. కాగా టీ20 ప్రపంచకప్‌-2024 ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement