కోహ్లితో గొడవపడ్డ నవీన్ (PC: IPL)
గడ్డి నీలంగా ఉందని గాడిద.. పులితో చెప్పింది!
లేదు లేదు.. గడ్డి పచ్చగా ఉంది.. పులి జవాబు..
రెండిటి మధ్య మాటా మాటా పెరిగింది.. దీంతో గాడిద, పులి కలిసి అడవికి రాజైన సింహం దగ్గరకు వెళ్లాయి.
అపుడు.. గాడిద గట్టిగా అరవడం మొదలుపెట్టింది.. మహారాజా గడ్డి నీలం రంగులోనే ఉంది.
అవును.. నిజమే గడ్డి నీలంగానే ఉంది.. సింహం బదులిచ్చింది.
గాడిదకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. కానీ పులి మాత్రం వెనక్కి తగ్గలేదు.
గడ్డి పచ్చగానే ఉందనే వాదనకు దిగింది.
గాడిదను శిక్షించమని సింహాన్ని కోరింది. కానీ.. సింహం అనూహ్య ప్రకటన చేసింది. పులిని శిక్షించాల్సిందిగా ఆదేశించింది.
వాదోపవాదాల అనంతరం ఐదేళ్ల పాటు మౌనంగా ఉండాలని పులిని సింహం ఆదేశించడంతో గాడిద ఆనందంగా గంతులేసుకుంటూ వెళ్లిపోయింది.
పులి.. సింహం వేసిన శిక్షను ఆమోదించింది.
అయితే, అంతకంటే ముందు.. ‘‘మహారాజా.. గడ్డి పచ్చగానే ఉంటుంది కదా!’’ అని సింహాన్ని అడిగింది. అవునని సింహం బదులిచ్చింది.
మరి మీరు నన్నెందుకు శిక్షిస్తున్నారు అని అడిగింది.
ఇందుకు బదులిస్తూ.. ‘‘అసలు గడ్డితో నీకేం పని? అది పచ్చగా ఉందా? నీలంగా ఉందా? అన్న విషయం నీకెందుకు? నీలాంటి తెలివైన జంతువులు అసలు ఈ విషయాల గురించి పట్టించుకోవడమే తప్పు.
అలాంటిది నా దగ్గరకు వచ్చి నా సమయం కూడా వృథా చేశావు. అందుకే నీకు శిక్ష విధించాను’’ అని పులి సందేహాన్ని తీర్చింది. ఇందులో నీతి ఏమిటంటే.. టైమ్‌ను ఎంత చెత్తగా వేస్ట్ చేస్తామో తెలుసుకోవడం!
నిజాన్ని అంగీకరించని మూర్ఖులతో ఏళ్లకు ఏళ్లు వాదించినా ప్రయోజనం ఉండదు. ఇది తప్పు.. ఇది ఒప్పు అని వాళ్లకు ఎన్ని సాక్ష్యాలు చూపించినా వారి వారి ఊహాగానాలు, ఏకపక్ష అభిప్రాయాలు మారవు. అసలు మనం చెప్పే విషయాలను అర్థం చేసుకునే స్థాయి వాళ్లకు ఉండదు.
అహంకారంతో వాళ్ల కళ్లు మూసుకుపోతాయి. తాము చెప్పింది, చేసిందే సరైందనే ఈగోతో ఉంటారు. అలాంటి వాళ్లతో మాట్లాడి సమయం వృథా చేయడం వేస్ట్!!
అఫ్గనిస్తాన్ బౌలర్, లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్-ఉల్-హక్ ఇన్‌స్టాలో పంచుకున్న వీడియోలో ఉన్న నీతికథ ఇది. కాగా ఐపీఎల్-2023లో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా నవీన్.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో గొడవకు దిగిన విషయం తెలిసిందే.
మ్యాచ్ సందర్భంగా చెలరేగిన భావోద్వేగాలను అదుపుచేసుకోలేని ఈ యువ ఆటగాడు.. ఆట అయిపోయిన తర్వాత ఇరు జట్లు పరస్పరం కరచాలనం చేసుకునే కోహ్లి ఏదో అనగానే అతడి చేతిని విసిరికొట్టాడు.
దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదానికి దారి తీయగా.. లక్నో మెంటార్ గౌతం గంభీర్ జోక్యంతో గొడవ మరింత పెద్దదైంది. ఈ క్రమంలో మైదానాన్ని వీడిన తర్వాత కోహ్లి, నవీన్ ఒకరినొకరు ఉద్దేశిస్తూ నర్మగర్భ పోస్టులతో సోషల్ మీడియా వార్‌కు తెరతీశారు.
ఈ నేపథ్యంలో కోహ్లిని కించపరిచే విధంగా వ్యవహరించాడంటూ నవీన్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు కింగ్ కోహ్లి ఫ్యాన్స్. ఎక్కడ మ్యాచ్ జరిగినా కోహ్లి నామస్మరణతో అతడిని టీజ్ చేశారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో నవీన్ మాట్లాడుతూ.. కోహ్లినే గొడవ మొదలుపెట్టాడని పేర్కొన్నాడు.
ఆ తర్వాత నవీన్‌పై ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రిప్టిక్ పోస్ట్‌తో ముందుకు వచ్చాడు నవీన్ ఉల్ హక్. ఇది కోహ్లి ఫ్యాన్స్‌ను ఉద్దేశించే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే, కింగ్ అభిమానులు ఈ వీడియోపై కూడా తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘అవును నువ్వు గాడిదవే! నీతో వాదించడం మా కింగ్ తప్పే. అయినా ఇక్కడ మా స్టార్ పులిలాంటి వాడు కాదు..
సింహం లాంటోడు.. ఆ సింహం అడవికి రాజైతే.. మా కోహ్లి రికార్డుల రారాజు. అది గుర్తుపెట్టుకో!’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందుకు నవీన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి!!
చదవండి: WC 2023: గొప్ప బ్యాటర్‌వే! కానీ నీకసలు బుర్ర లేదు..
Comments
Please login to add a commentAdd a comment