T20 WC 2022:Virat Kohli Childhood Coach Rajkumar Sharma Give Major Update On Is Virat Playing His Last T20 World Cup - Sakshi
Sakshi News home page

T20 WC 2022: ప్రపంచకప్‌ తర్వాత టీ20లకు కోహ్లి గుడ్‌బై? అంతలేదు.. వచ్చే వరల్డ్‌కప్‌లో కూడా

Published Wed, Oct 19 2022 11:17 AM | Last Updated on Wed, Oct 19 2022 12:52 PM

WC 2022: Is Kohli Playing Last T20 WC Childhood Coach Gives Answer - Sakshi

విరాట్‌ కోహ్లి

T20 World Cup 2022- Virat Kohli: టీ20 వరల్డ్‌కప్‌-2022 తర్వాత టీమిండియా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతాడా? వన్డే, టెస్టు క్రికెట్‌పై మరింత దృష్టి సారించేందుకు టీ20లకు వీడ్కోలు పలుకుతాడా? ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌, ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ వన్డేల నుంచి వైదొలిగితే.. కోహ్లి మాత్రం తనకు అచ్చొచ్చిన వన్డేల్లో మరింతగా రాణించేందుకు ట్వంటీ ట్వంటీ ఫార్మాట్‌ నుంచి రిటైర్‌ అవుతాడా? గత కొన్నిరోజులుగా విరాట్‌ కోహ్లి గురించి ఇలాంటి వదంతులు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి పొట్టి క్రికెట్‌ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ ఈ విషయంపై స్పందించాడు. ఇండియా న్యూస్‌తో మాట్లాడిన ఆయన.. కోహ్లికి కచ్చితంగా ఇదే ఆఖరి టీ20 వరల్డ్‌కప్‌ కాదని స్పష్టం చేశాడు.

కచ్చితంగా మరో టీ20 వరల్డ్‌కప్‌ ఆడతాడు!
‘‘టీమిండియాకు సుదీర్ఘ కాలంగా ఆడుతున్న ఘనత కోహ్లిది. తన ఫామ్‌, ఫిట్‌నెస్‌, పరుగుల దాహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జట్టును గెలిపించాలనే పట్టుదల అతడిలో మెండు. టీ20 వరల్డ్‌కప్‌-2024లోనూ కోహ్లి ఆడతాడని భావిస్తున్నా. కచ్చితంగా తనకైతే ఇది చివరి టీ20 ప్రపంచకప్‌ కాదని చెప్పగలను’’ అని రాజ్‌కుమార్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

ఇక ఇటీవల ముగిసిన ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీలో కోహ్లి సెంచరీ చేయడాన్ని రాజ్‌కుమార్‌ శర్మ ప్రస్తావిస్తూ.. ‘‘గడ్డు పరిస్థితులను అతడు ధీటుగా ఎదుర్కొన్నాడు. తన ఆట తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్‌ గెలవడంలో కోహ్లి కీలక పాత్ర పోషిస్తానడంలో సందేహం లేదు’’ అని పేర్కొన్నాడు.

కింగ్‌ సాధిస్తాడు!
కాగా గతేడాది ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వన్డే, టెస్టు సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఇక టీ20 వరల్డ్‌కప్‌ ఎనిమిదో ఎడిషన్‌ ఆడనున్న కోహ్లికి ఇది ఐదో ఐసీసీ ఈవెంట్‌ కావడం గమనార్హం.

ఇప్పటికే 71 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేసిన కింగ్‌ కోహ్లి..ఈ మెగా టోర్నీలోనూ శతకంతో సత్తా చాటాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కోహ్లికి ఉన్న రికార్డు నేపథ్యంలో అక్టోబరు 23 నాటి ఆరంభ మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ నమోదు చేయాలని కోరుకుంటున్నారు.

చదవండి: 'అలా అయితే 2023 వన్డే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్‌ చేస్తాం'.. బీసీసీఐకు పీసీబీ అల్టిమేటం!
BCCI- Key Decisions: గంగూలీకి గుడ్‌బై! జై షా కొనసాగింపు.. బీసీసీఐ కీలక నిర్ణయాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement