అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు (PC: ICC)
ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్-2023లో సంచలన విజయాలు నమోదు చేసిన అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు తొలిసారిగా అర్హత సాధించింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్- శ్రీలంక మధ్య సోమవారం నాటి మ్యాచ్ ఫలితం తర్వాత ఈ మేరకు ఐసీసీ ఈవెంట్ బెర్తును ఖరారు చేసుకుంది.
కాగా ఢిల్లీ వేదికగా అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. శ్రీలంకను 3 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో శ్రీలంక కూడా ఈ వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇప్పటికే బంగ్లా కూడా ఇదే తరహాలో ఇంటిబాట పట్టినప్పటికీ పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు వరుసగా 7, 8 స్థానాల్లో నిలిచాయి.
పాకిస్తాన్‌లో మెగా టోర్నీ
ఇక 2025లో పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. ఈ టోర్నీకి అర్హత సాధించాలంటే ఈ ప్రపంచప్‌లో పాయింట్ల పట్టికలో టాప్-7లో నిలవాలని ఐసీసీ ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో బంగ్లా చేతిలో ఓటమితో శ్రీలంక ఎనిమిదో స్థానానికి పడిపోగా.. ఆరో స్థానంలో ఉన్న అఫ్గనిస్తాన్ తమ బెర్తును ఖాయం చేసుకుంది.
కాగా పాకిస్తాన్ ఆతిథ్య జట్టు కాబట్టి ఆటోమేటిక్‌గా క్వాలిఫై కాగా.. టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించాయి. తాజాగా అఫ్గన్ కూడా ఆ జాబితాలో చేరింది. మిగతా రెండు స్థానాల కోసం బంగ్లాదేశ్, శ్రీలంకలతో పాటు నెదర్లాండ్స్, ఇంగ్లండ్ కూడా పోటీపడనున్నాయి.
సంచలనాలకు మారుపేరుగా..
2015, 2019 వరల్డ్‌కప్ ఎడిషన్లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన అఫ్గనిస్తాన్ ఈసారి అంచనాలకు మించి రాణించింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో పాటు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించింది.
మొత్తంగా ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 8 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో ఉంది. ముంబైలో మంగళవారం నాటి మ్యాచ్‌లో గనుక ఆస్ట్రేలియాను ఓడిస్తే అఫ్గన్‌కు ప్రపంచకప్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.
చదవండి: టైమ్డ్ ఔట్ కాకుండా మరో విచిత్ర పద్దతిలో ఔట్.. అది కూడా ఈ ఏడాదిలోనే..!
Comments
Please login to add a commentAdd a comment