
టీమిండియా
ICC WC 2023- Hardik Pandya Ruled Out: వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ చేరిన సంతోషంలో ఉన్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ! స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.
ప్రకటన విడుదల చేసిన ఐసీసీ
చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పాండ్యా స్థానాన్ని బీసీసీఐ యువ పేసర్ ప్రసిద్ కృష్ణతో భర్తీ చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా
పట్టుతప్పి పడిపోయి
కాగా ప్రపంచకప్-2023 లీగ్ దశలో భాగంగా పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌లో బంగ్లా బ్యాటర్ బాదిన షాట్‌ను అడ్డుకునే క్రమంలో పట్టుతప్పి కింద పడిన పాండ్యా కాలికి గాయమైంది.
దీంతో అతడు ఓవర్ పూర్తి చేయకుండానే క్రీజును వీడగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(రైట్‌ఆర్మ్ పేసర్) పాండ్యా స్థానంలో బరిలోకి దిగాడు. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాండ్యా మళ్లీ బ్యాటింగ్‌కు కూడా రాలేదు.
సెమీస్ వరకు ఒకే.. కానీ కీలక సమయంలో ఇలా
ఈ నేపథ్యంలో స్కానింగ్‌కు వెళ్లిన పాండ్యా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరుసటి రెండు మ్యాచ్‌లకు అతడు దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
కానీ.. పూర్తిగా కోలుకోని కారణంగా సెమీస్ చేరాలంటే కీలకమైన శ్రీలంకతో మ్యాచ్‌కూ దూరమయ్యాడు. అయితే, టీమిండియా అద్బుత ప్రదర్శనతో 302 పరుగుల భారీ విజయంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
#Prasidh Krishna- కర్ణాటక పేసర్‌కు లక్కీ ఛాన్స్
తదుపరి.. లీగ్ దశలో టీమిండియా రెండు నామమాత్రపు మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. అయితే, సెమీస్‌లో మాత్రం హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆల్‌రౌండర్ సేవలు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో కీలక సమయంలో రోహిత్ సేనకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఊహించని రీతిలో కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణను అదృష్టం వరించింది. సొంతగడ్డ మీద తొలిసారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భాగమయ్యే అవకాశం దక్కింది.
చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ