ICC WC 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు టైటిళ్లు గెలిచిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. భారత సారథిగానూ అద్భుత విజయాలు అందుకుంటున్నాడు. ఇప్పటికే ఆసియా కప్‌లో టీమిండియాను రెండుసార్లు విజేతగా నిలిపిన హిట్‌మ్యాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అన్ని ఫార్మాట్లలో జట్టును ఏకకాలంలో టాప్‌లో నిలిపాడు.
నంబర్ 1గా టీమిండియా
ఇక గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో విఫలమైనప్పటికీ.. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జట్టును ముందుకు నడుపుతూ వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో లీగ్ దశలో ఆడిన ఐదింటిలో ఐదూ గెలిచి జట్టును అగ్రపథంలో నిలిపాడు.
ఈ నేపథ్యంలో అక్టోబరు 29న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న క్రమంలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. నాయకుడిగా తాను విజయవంతం కావడం వెనుక గల కారణాలను విశ్లేషించాడు.
ఆ బాధ్యత మనదే
‘‘ఇలాంటి కీలక టోర్నీలు, చాంపియన్‌షిప్స్‌లో గెలవాలంటే ఒకరిద్దరు కాదు జట్టు సమిష్టిగా పోరాడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేస్తేనే ముందుకు వెళ్లగలుగుతాం. కాబట్టి ప్రతి ఆటగాడు మానసికంగా ప్రశాంతంగా.. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది.
ఎవరు ఏం చెప్పినా ఓపికగా వినాలి. వాళ్లకు ఏం కావాలో.. తమ వ్యూహాలను ఎలా అమలు చేయాలనుకుంటున్నారో పూర్తిగా అడిగి తెలుసుకోవాలి. అలా చేయాలంటే నేను ముందుగా వారిలా ఆలోచించగలగాలి.
నా స్వభావం అదే.. ఒత్తిడి తగ్గిస్తేనే
అయితే, అదృష్టవశాత్తూ నా స్వభావం అలాంటిదే. ఆటగాడిగా ఇన్నేళ్ల నా ప్రయాణంలో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వ్యక్తిగత అనుభవాలు కూడా కావాల్సినన్ని ఉన్నాయి.
వాటి ఆధారంగానే జట్టును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలంటే ఏం చేయాలో తెలుసుకోగలిగాను. ఎవరికి ఏం కావాలో.. అడిగి మరీ తెలుసుకోవడం.. వారి ప్రణాళికలను అమలు చేసేందుకు స్వేచ్ఛను ఇవ్వడం ముఖ్యం.
ఇలాంటి మేజర్ టోర్నీలు ఆడేటపుడు ఆటగాళ్లపై ఒత్తిడి ఉండటం సహజం. కాబట్టి మనమే స్వయంగా పూనుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారాలు చూపాలి. ఒత్తిడి నుంచి వారిని బయటపడేయాలి’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
చదవండి: WC 2023: స్నేహాలు, పర్సనల్ రిలేషన్‌షిప్స్.. అందుకే జట్టుకు ఈ దుస్థితి!
Comments
Please login to add a commentAdd a comment