పాకిస్తాన్ క్రికెట్ జట్టు (PC: ICC)
ICC WC 2023- Baba Azam And Co. Fined: వన్డే వరల్డ్‌కప్-2023లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ అంతర్జాతీయ క్రికెట్ మండలి పాక్ జట్టుకు భారీ జరిమానా విధించింది.
కాగా చెన్నైలోని చెపాక్ వేదికగా బాబర్ ఆజం బృందం శుక్రవారం సౌతాఫ్రికాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఈ క్రమంలో పాక్ విధించిన లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా టాపార్డర్ విఫలం కాగా.. నాలుగో నంబర్ బ్యాటర్ ఎయిడెన్ మార్కరమ్ 91 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, అతడు అవుటైన తర్వాత ఆఖరి వరకు హైడ్రామా నెలకొంది. గెలుపునకు చేరువగా వచ్చిన సఫారీలు 10 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోవడంతో చిక్కుల్లో పడింది.
సెమీస్ ఆశలపై నీళ్లు!
మరోవైపు.. తొమ్మిదో వికెట్ పడగొట్టిన పాకిస్తాన్ ఆఖరి వికెట్ కోసం 11 బంతులపాటు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేశవ్ మహరాజ్ 48వ ఓవర్ రెండో బంతికి ఫోర్ బాది సౌతాఫ్రికా విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో ఓటమిపాలైన పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు పూర్తి సంక్లిష్టంగా మారాయి.
వరుసగా నాలుగో పరాజయంతో సెమీ ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించే స్థితికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనట్లు తేలడంతో ఐసీసీ ఫైన్ వేసింది. జట్టు మ్యాచ్ ఫీజులో 20 శాతం మేర కోత విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
ప్రతీ ఓవర్‌కు ఐదు శాతం చొప్పున.. మొత్తంగా
‘‘నిర్ణీత సమయంలో వేయాల్సిన దానికంటే నాలుగు ఓవర్లు తక్కువగా వేసినందుకు.. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి సంబంధించిన ప్రవర్తనా నియమావళి ప్రకారం ఆలస్యమైన ప్రతీ ఓవర్‌కు ఐదు శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధించడం జరుగుతుంది’’ అని తెలిపింది. ఈ విషయంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తమ తప్పును అంగీకరించడంతో ఎటువంటి విచారణ అవసరం లేకుండా ఫైన్ వేసినట్లు వెల్లడించింది.
జీతాల్లేవు.. ఆ విషయంలో పీసీబీ వెనుకడుగు
కాగా వరుస ఓటముల నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా బోర్డు నుంచి మద్దతు కరువైనట్లు ఆటగాళ్లు ఆవేదన చెందుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అదే విధంగా.. సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో క్రికెటర్లతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న పాక్ క్రికెట్ బోర్డు వెనక్కి తగ్గే ఆలోచనలో ఉందని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు చెప్తున్నారు.
అంతేకాదు ఐదు నెలలుగా పాక్ ఆటగాళ్లకు జీతాలు కూడా ఇవ్వడం లేదని సమాచారం. తాజాగా ఇలా మ్యాచ్ ఫీజులో కోత పడటంతో పాక్ జట్టు పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు తయారైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: అంతా తెలిసే చేశావంటే నిన్నేమనుకోవాలి? అతడి రాతే అంత.. ఎప్పుడూ ఇలాగే!
Comments
Please login to add a commentAdd a comment