‘‘ఇంతకుముందు చాలా సార్లు నన్ను ఈ ప్రశ్న అడిగారు. నేనేతై వందకు వంద శాతం కివీనే. అయితే, భారత సంతతి మూలాలు ఉండటం పట్ల కూడా గర్విస్తున్నా’’ అని న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అన్నాడు. ఇండియాలో ఆడటం వల్ల తనపై ఎలాంటి ఒత్తిడి పడటం లేదని పేర్కొన్నాడు.
కాగా బెంగళూరుకు చెందిన రవి కృష్ణమూర్తి దంపతుల కుమారుడే రచిన్ రవీంద్ర. తనకు ఇష్టమైన భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కలిసి వచ్చేలా రవి తన కుమారుడికి రచిన్ రవీంద్రగా నామకరణంగా చేశాడు.
ఇక న్యూజిలాండ్‌లో పుట్టిపెరిగిన రచిన్ అనంతపురంలో క్రికెట్ మెళకువలు నేర్చుకున్నాడు. టీమిండియాతో 2012లో సిరీస్ సందర్భంగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
ఈ క్రమంలో తొలిసారి వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా మెగా టోర్నీ ఆడుతున్న రచిన్ ఆరంభ మ్యాచ్లో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడు. 123 పరుగులతో అజేయంగా నిలిచి డిఫెండింగ్ చాంపియన్ ఓటమిని శాసించాడు.
ఆ తర్వాత కూడా కివీస్ విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్ శనివారం మ్యాచ్‌లోనూ బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. ఆస్ట్రేలియాతో ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోయినప్పటికీ రచిన్ ఆట అభిమానులను ఆకట్టుకుంది. ఆసీస్‌తో మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన రచిన్ 89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 116 పరుగులు చేశాడు.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రచిన్ రవీంద్రకు ఇండియాలో మ్యాచ్ ఆడటం ఒత్తిడి కలిగిస్తోందా అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. ‘‘ఇక్కడ నేను కివీ(న్యూజిలాండ్ పౌరుడు అన్న ఉద్దేశం)గా అడుగుపెట్టాను.
అయితే, నా తల్లిదండ్రులు పుట్టిపెరిగిన దేశం ఇది. మా కుటుంబ సభ్యుల్లో చాలా మంది ఇక్కడే ఉన్నారు’’ అని పేర్కొన్నాడు. ఇక ఇండియాలో పిచ్ కండిషన్లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయన్న రచిన్.. తన నైపుణ్యాలను రోజురోజుకీ మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టానని తెలిపాడు.
సచిన్ తర్వాత రచినే
కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఇప్పటి వరకు 406 పరుగులు సాధించిన రచిన్ రవీంద్ర.. 23 ఏళ్ల వయసులో ప్రపంచకప్ చరిత్రలో 400+ పరుగులు రాబట్టిన రెండో ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. అంతకు ముందు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఈ ఫీట్ నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment