WC 2023- Semi Final Race: వన్డే వరల్డ్‌కప్-2023 సెమీస్ రేసులో నిలిచే జట్లపై మూడు రోజుల్లో స్పష్టత రానుంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాప్-4లో నిలిచేందుకు న్యూజిలాండ్, పాకిస్తాన్‌లతో పాటు.. అఫ్గనిస్తాన్ కూడా పోటీ పడుతోంది.
రౌండ్ రాబిన్ పద్ధతిలో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ మూడు జట్లు నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఉన్నాయి. అయితే, రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న న్యూజిలాండ్.. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌లను దాటి నాలుగో స్థానంలో ఉంది.
ఈ క్రమంలో లీగ్ దశలో ఈ మూడు జట్లకు మిగిలిన ఒక్క మ్యాచ్‌లో ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపైనే సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో న్యూజిలాండ్, పాక్, అఫ్గన్ విజయం సాధిస్తే రన్‌రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టే సెమీస్‌లో అడుగుపెడుతుంది.
ముందుగా న్యూజిలాండ్ బరిలోకి
ఈ క్రమంలో ముందుగా... న్యూజిలాండ్ శ్రీలంకతో గురువారం మ్యాచ్ ఆడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో కివీస్ భారీ విజయం గనుక సాధిస్తే సులువుగానే సెమీస్‌కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
అయితే, వర్షం రూపంలో కివీస్ జట్టుకు భారీ ప్రమాదం పొంచి ఉంది. accuweather సైట్ వివరాల ప్రకారం గురువారం బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైనా.. లేదంటే దురదృష్టవశాత్తూ లంక చేతిలో ఓడినా కివీస్‌కు ఎదురుదెబ్బ తప్పదు.
అలా అయితే పాక్, అఫ్గన్ మరింత ముందుకు
కాగా వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే కివీస్, లంకకు చెరో పాయింట్ మాత్రమే వస్తుంది. అంటే అపుడు కివీస్ ఖాతాలో 9 పాయింట్లు మాత్రమే ఉంటాయి. వర్షం పడక అంతా సవ్యంగా సాగి గెలిస్తే 10 పాయింట్లు వస్తాయి. అయినప్పటికీ అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మ్యాచ్ ఫలితాల తర్వాతే సెమీస్ బెర్తు ఖాయమైంది లేనిదీ తెలుస్తుంది. అయితే, శ్రీలంకతో న్యూజిలాండ్ ఓడిపోతే మాత్రం అఫ్గన్, పాకిస్తాన్ రేసులో మరో ముందడుగు వేస్తాయి.
చదవండి: అతడు శ్రీలంకకు వస్తే జరిగేది ఇదే: ఏంజెలో మాథ్యూస్ సోదరుడి వార్నింగ్
Comments
Please login to add a commentAdd a comment