ICC Cricket World Cup 2023- Australia vs Netherlands: భారత్ వేదికగా వరల్డ్‌కప్-2023లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా ప్రతాపం చూపింది. డచ్ జట్టును ఏకంగా 309 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. సౌతాఫ్రికాపై సంచలన విజయంతో జోష్‌లో ఉన్న డచ్ జట్టు ఉత్సాహాన్ని నీరుగారుస్తూ సమిష్టి ప్రదర్శనతో వార్ వన్‌సైడ్ చేసింది.
తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర
తద్వారా ఐసీసీ ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో అత్యంత భారీ విజయం నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(104) సెంచరీతో అదరగొట్టగా.. స్టీవ్ స్మిత్ 71, మార్నస్ లబుషేన్ 62 పరుగులతో రాణించారు.
మాక్సీ పరుగుల సునామీ
వీరిద్దరు అర్ధ శతకాలతో రాణిస్తే ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఫాస్టెస్ట్ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 9 ఫోర్లు,8 సిక్స్‌ల సాయంతో 106 పరుగులు సాధించాడు. మాక్సీ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు సాధించింది.
స్టార్క్ ఆరంభిస్తే.. జంపా ముగించాడు
ఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఆసీస్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. పేసర్ మిచెల్ స్టార్క్ వికెట్ల పతనం ఆరంభించగా.. స్పిన్నర్ ఆడం జంపా లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ క్రమంలో కేవలం 90 పరుగులు మాత్రమే చేసి నెదర్లాండ్స్ ఆలౌట్ అయింది. 21 పరుగులకే కథ ముగించి ఘోర ఓటమిని మూటగట్టుకుంది.
ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఒక్కో వికెట్ తీయగా.. బ్యాట్‌తో రాణించలేకపోయిన మిచెల్ మార్ష్ రెండు వికెట్లు కూల్చాడు. ఇక ఆడం జంపా అత్యధికంగా నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ మీద ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఫాస్టెస్ట్ సెంచరీ హీరో గ్లెన్ మాక్స్‌వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
చదవండి: WC 2023: వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment