ఐసీసీ టోర్నమెంట్లలో లీగ్ దశలో అదరగొట్టడం.. నాకౌట్ మ్యాచ్‌లలో తేలిపోయి ఇంటి బాట పట్టడం.. ఫలితంగా ‘చోకర్స్’ అనే ముద్ర. అవును.. సౌతాఫ్రికా గురించే ఈ ప్రస్తావన. పటిష్ట జట్టుగా పేరొందిన ప్రొటిస్ జట్టు 1998లో చాంపియన్స్ ట్రోఫీ రూపంలో తొలిసారి ఐసీసీ టైటిల్ సాధించింది.
అదే మొదలు.. అదే ఆఖరు
హాన్సీ క్రోంజీ సారథ్యంలో ఫైనల్లో వెస్టిండీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. అయితే, ఆ తర్వాత ఇంత వరకు మళ్లీ ఒక్కసారి కూడా మెగా టోర్నీ విజేతగా నిలవలేకపోయింది. కానీ.. ఈసారి మాత్రం ఆ అపవాదును చెరిపేసుకుంటామంటున్నాడు సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్.
టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్‌గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు మార్క్రమ్. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్లో ప్రొటిస్ జట్టు.. శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్‌లతో కలిసి గ్రూప్-డీ లో ఉంది.
ఈ క్రమంలో న్యూయార్క్ వేదికగా సోమవారం శ్రీలంకతో తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది సౌతాఫ్రికా. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ వరల్డ్‌కప్ గెలిచేందుకే తాము ఇక్కడికి వచ్చామని పేర్కొన్నాడు.
ఈసారి ట్రోఫీ మాదే
‘‘నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఈ టోర్నీలో పోటీపడుతున్న జట్లన్నీ గొప్పగానే ఆడుతున్నాయి. అయితే, మేము గనుక ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చామంటే.. మా అత్యుత్తమ ప్రదర్శనతో ముందుకు సాగుతూనే ఉంటాం.
ప్రత్యర్థి ఎవరైనా ఓడించే తీరతాం. మా ఆట తీరుపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే, మేము ఇక్కడికి వచ్చింది మాత్రం ట్రోఫీ గెలిచేందుకే!’’ అని పేర్కొన్నాడు. ఈసారి చాంపియన్లుగా నిలిచేది తామేనంటూ మార్క్రమ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
టీ20 ప్రపంచకప్-2024కు సౌతాఫ్రికా జట్టు
ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.
చదవండి: T20 WC 2024: దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక.. గెలుపు ఎవరిది?
Comments
Please login to add a commentAdd a comment