సరదా కోసం కాదు... క్రికెట్‌ ఆడేందుకు వచ్చాం! | We Came Here To Play A Game Says RCB Captain Virat Kohli | Sakshi
Sakshi News home page

సరదా కోసం కాదు... క్రికెట్‌ ఆడేందుకు వచ్చాం!

Published Wed, Sep 2 2020 4:02 AM | Last Updated on Sat, Sep 19 2020 3:44 PM

We Came Here To Play A Game Says RCB Captain Virat Kohli - Sakshi

దుబాయ్‌: ‘బయో సెక్యూర్‌ బబుల్‌’ నిబంధనలు అనుసరించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. అన్నీ మరచి ఆటపైనే దృష్టి పెట్టాలని అతను సహచరులకు సూచించాడు. ‘మేమందరం ఇక్కడ క్రికెట్‌ ఆడటానికి వచ్చాం. టోర్నమెంట్‌ సాఫీగా సాగాలంటే ప్రతీ ఒక్కరు బయో బబుల్‌ నిబంధనలు గౌరవించాల్సిందే. ఏదో సరదాగా గడిపేందుకు మనం రాలేదు. నేను హాయిగా దుబాయ్‌ వీక్షించి వస్తానంటే కుదరదు.

అంత గొప్ప పరిస్థితుల్లో మనం ప్రస్తుతం లేము. ఎలాంటి దశను దాటుతున్నామో అర్థం చేసుకోవాలి. ఒక రకంగా మనం అదృష్టవంతులం. ఇంత కఠోర పరిస్థితుల్లోనూ ఐపీఎల్‌ ఆడే అవకాశం లభించింది. ఇతర పరిస్థితులు మనల్ని నియంత్రించేలా వ్యవహరించవద్దు’ అని కోహ్లి తన సహచరులకు ఉద్బోధ చేశాడు. బహుశా చాలా ఏళ్లుగా విరామం లేకుండా ఆడుతుండటం వల్ల ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉన్నా తనకు ఎలాంటి ఇబ్బందీ అనిపించలేదని కోహ్లి అన్నాడు. రెండు నెలల క్రితం అసలు ఐపీఎల్‌ జరిగే అవకాశం లేదని భావించామని... ఇప్పుడు మళ్లీ లీగ్‌లో ఒక్క చోట చేరడం సంతోషంగా ఉందని అతను అభిప్రాయ పడ్డాడు.   

రిచర్డ్సన్‌ స్థానంలో జంపా 
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన పేస్‌ బౌలర్‌ కేన్‌ రిచర్ట్సన్‌ స్థానంలో అదే దేశానికి చెందిన లెగ్‌స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా జట్టులోకి వచ్చాడు. తన భార్య తొలి బిడ్డకు జన్మనిస్తున్న కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని రిచర్డ్సన్‌ నిర్ణయించుకున్నాడు. దాంతో జంపాను ఆర్‌సీబీ ఎంచుకుంది. ఐపీఎల్‌ వేలంలో రిచర్డ్సన్‌ను బెంగళూరు రూ. 4 కోట్లకు తీసుకుంది. జట్టులో ఇప్పటికే చహల్, సుందర్, మొయిన్‌ అలీ, పవన్‌ నేగి, షహబాజ్‌ అహ్మద్‌ రూపంలో ఐదుగురు స్పిన్నర్లు ఉండగా...ఇప్పుడు జంపా రాకతో ఆ సంఖ్య ఆరుకు పెరిగింది. జంపా గతంలో ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.  28 ఏళ్ల జంపా 147 టి20 మ్యాచ్‌లలో 169 వికెట్లు పడగొట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement