యశస్వి జైశ్వాల్- తిలక్ వర్మ
Paras Mhambrey Comments: రానున్న మ్యాచ్‌లలో యువ బ్యాటర్లు తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్‌లతో బౌలింగ్ చేయిస్తామని టీమిండియా బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే అన్నాడు. బ్యాట్‌తో రాణించడంతో పాటు బౌలింగ్ చేయగల సత్తా కూడా వారిలో ఉందంటూ ప్రశంసించాడు. త్వరలోనే తిలక్, యశస్వి బంతితో మైదానంలో దిగడం చూస్తారంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
అరంగేట్రంలో అదరగొట్టారు
కాగా వెస్టిండీస్ గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్‌లలో అడుగుపెట్టారు యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ. టెస్టు సిరీస్‌తో యశూ అరంగేట్రం చేస్తే.. హైదరాబాదీ స్టార్ టీ20లతో ఎంట్రీ ఇచ్చాడు. ముంబై బ్యాటర్ సెంచరీతో టెస్టులను ఆరంభిస్తే.. తిలక్ అరంగేట్ర మ్యాచ్‌లోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇలా ఈ ఇద్దరు లెఫ్టాండర్లు కెరీర్ ఆరంభంలోనే తమదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో వెలుగులోకి వచ్చిన యశస్వి, తిలక్‌లు ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే 2-1తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెనుకపడ్డ హార్దిక్ సేనకు నాలుగో మ్యాచ్ కీలకంగా మారింది.
ఫ్లోరిడాలో శనివారం జరిగే టీ20లో గెలిస్తేనే టీమిండియా సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు విలేకరులతో మాట్లాడిన పారస్ మాంబ్రే.. తిలక్ వర్మ, యశస్వి జైశ్వాల్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కనీసం ఒక్క ఓవర్ అయినా వేస్తారు
‘‘అన్ని విభాగాల్లో రాణించగల నైపుణ్యాలు గల ఆటగాళ్లు అందుబాటులో ఉంటే బాగుంటుంది. తిలక్, యశస్వి అండర్ 19 క్రికెట్ ఆడేటపుడు బౌలింగ్ చేయడం నేను చూశాను. నాణ్యమైన బౌలర్లుగా ఎదగగల సత్తా వారిలో ఉంది.
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌పై కూడా దృష్టి సారిస్తే కచ్చితంగా రాణిస్తారు. ఇలాంటి ఆప్షన్లు ఉన్నపుడు సహజంగానే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్లపై మేము కూడా ఫోకస్ చేస్తున్నాం. త్వరలోనే టీమిండియా తరఫున తిలక్, యశస్వి బౌలింగ్ చేయడం చూస్తారు. కనీసం ఒక్క ఓవర్ అయినా వేస్తారు’’అని పారస్ మాంబ్రే పేర్కొన్నాడు.
ఎన్ని వికెట్లు తీశారంటే
కాగా తిలక్ వర్మ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 9 మ్యాచ్‌లలో మూడు వికెట్లు తీయగా.. 25 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. ఇక యశస్వి లిస్ట్- ఏ క్రికెట్‌లో 32 మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.
చదవండి: Ind vs WI: ఇంతకంటే మంచి పిచ్ మీకెక్కడా దొరకదు.. ఇక్కడైనా ఆడండి!
Comments
Please login to add a commentAdd a comment